YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అర్ధం కాని మాయ

అర్ధం కాని మాయ

పవన్ కల్యాణ్, మాయావతి కలిసికట్టుగా పొత్తు ప్రకటించడమే కాదు, ప్రచారానికీ శ్రీకారం చుట్టారు. వామపక్ష,బహుజనసేనల శ్రామిక,దళిత, యువ సమ్మేళనం బలమైన సంకీర్ణంగానే చెప్పుకోవాలి. అన్నీ కలిసొస్తే గట్టి పోటీనిచ్చే కాంబినేషన్ గా ఈ కూటమిని చూడాలి. అయితే ప్రస్తుత రాజకీయంలో తెరవెనక తతంగాలు ఎక్కువైపోయాయి. అసలు ఈ కూటమి వ్యూహమేమిటనే సందేహాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చేందుకే పొత్తు కట్టారా? లేక అధికారపక్షానికి సహకరించేందుకు, వైసీపీ ఓట్లకు గండి కొట్టేందుకు జట్టుగా కలిసి నడుస్తున్నారా? అన్న అనుమానాలూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆంధ్ర్రప్రదేశ్ లో ఈ కూటమి బలమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కార్మికవర్గాలకు దన్నుగా నిలిచే వామపక్షాలు రెండు దశాబ్దాలుగా క్రమేపీ తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తున్నాయి. ప్రస్తుతం అస్తిత్వం పోరాటంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం దళిత వర్గాల్లో ఆశలు రేకెత్తించిన బహుజనసమాజ్ పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేసి కుచించుకుపోయింది. ఆయా పార్టీలన్నీ పునరుజ్జీవం పొందడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినట్లే చెప్పుకోవాలి.బహుజనసమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం బీఎస్పీకి సంబంధించి ఒక కీలకమైన పరిణామమే. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి నడుస్తున్న బీఎస్పీ ఇక్కడ జనసేనతో కలవడాన్ని వ్యూహాత్మకంగానే చూడాలి. చంచల నాయకురాలిగా పేరొందిన ఆమెతో డీల్ చేయడం కష్టమని సీనియర్ నాయకులు పేర్కొంటూ ఉంటారు. మిగిలిన నేతలను చిన్న చూపు చూడటం, అవమానించడం మాయావతి సహజలక్షణాలుగా చెబుతుంటారు. మాయావతిని ఏకోణంలో చూశారో కానీ పవన్ కల్యాణ్ ఎవరికీ ఇవ్వనంత గౌరవాన్ని ఆమెకిస్తున్నారు. గతంలో నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడులతో పవన్ కలిసి పనిచేశారు. కానీ వారెవ్వరికీ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించలేదు. తనను వారితో సమఉజ్జీగానే భావించుకున్నారు. కానీ మాయావతి విషయంలో మాత్రం పవన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒంటరి మహిళ అయినప్పటికీ పోరాటపటిమతో దళిత జాతికి ఆశాజ్యోతిగా నిలవడం మాటలు కాదని బహిరంగంగానే పవన్ వ్యాఖ్యానించారు. ఆమె కోరుకునేది కూడా అదే కనుక జనసేన, బీఎస్పీల సంబంధం దీర్ఘకాలం కొనసాగే సూచనలున్నట్లే చెప్పాలి. మాయావతికి పవన్ వందనం చేసిన తీరు ఆమె అభిమానులకు, ఎస్సీ వర్గాలకు బాగానే నచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న స్పందనలను అందుకు నిదర్శనగా తీసుకోవాలి.షెడ్యూల్డు కులాలకు చెందిన వర్గాలు కొన్ని తరాలుగా కాంగ్రెసు పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పట్నుంచీ ఇందిరాగాంధీకి విధేయంగా ఉంటూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన తర్వాత ఈ ఓట్లలో చీలిక వచ్చింది. ఎన్టీరామారావుపై అభిమానంతో కొందరు టీడీపీని సమర్థించారు. కానీ మెజార్టీ వర్గం కాంగ్రెసు వైపే నిలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కాంగ్రెసు వైపు ఈ ఓటు బ్యాంకు పూర్తిగా స్థిరపడింది. జగన్ మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఓటు బ్యాంకు వైసీపీవైపు మళ్లింది. కాంగ్రెసు పార్టీ ఎస్సీ వర్గాలకు దూరమైంది.ఎస్సీల్లో మాదిగలను మాత్రం రిజర్వేషన్ వర్గీకరణ పేరిట కొంత వరకూ టీడీపీ ఆకర్షించగలిగింది. కానీ ఏపీలో ఈవర్గం జనాభా సంఖ్య రీత్యా చాలా తక్కువ. మాయావతితో పవన్ వ్యవహరించిన శైలితో మాల సామాజికవర్గం లో కొంతమేరకు జనసేనకు ఆదరణ పెరగవచ్చని అంచనా. ఇది కచ్చితంగా వైసీపీ ఓట్లలో చీలికకు దారితీస్తుంది. అయితే బీఎస్పీ బలమే అంతంతమాత్రంగా ఉంది. అందువల్ల వైసీపీ గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేయకపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. కానీ 15 నుంచి 20 నియోజకవర్గాల్లో 5 నుంచి 6 వేల ఓట్ల వరకూ బీఎస్పీ వల్ల జనసేనకు లబ్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.నిజానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న కాలం నుంచే బహుజన సమాజ్ ఈ రాష్ట్రంపై శ్రద్ధ పెట్టడం మానేసింది. స్వతంత్ర అభ్యర్థిగా ఉండటం కంటే ఏదో ఒక పార్టీ గుర్తు ఉంటే మంచిదని కొందరు పెద్ద నాయకులు బీఎస్పీ గుర్తుపై గతంలో పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో ఒక్కోసందర్భంలో టిక్కెట్టు రాని బలమైన అభ్యర్థులు బీఎస్పీ టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అధికారపార్టీలోకి చేరిపోయారు. అలా ఇతరులకు ఉపయోగడపడటమే తప్ప బీఎస్పీ సొంతంగా బలపడిన ఉదంతాలు లేవు. మాయావతికి ప్రధాని కావాలనేది చిరకాల వాంఛ. దక్షిణాదిన పట్టు దొరకడం లేదు. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ లో పార్టీకి గట్టి పట్టు ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర,ఢిల్లీలోనూ పార్టీకి బలముంది. ప్రస్తుతమున్న అనిశ్చిత రాజకీయ వాతావరణం బీఎస్పీకి అనుకూలిస్తుందని మాయావతి అంచనా వేస్తున్నారు. దళిత వర్గాలను ఏకం చేయగలిగితే ప్రాంతీయపార్టీలతో పాటు కాంగ్రెసు, బీజేపీలలో ఏదో ఒకపార్టీ తనకు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని ఆమె భావిస్తున్నారు. అందులో భాగంగానే దక్షిణాదిపైనా దృష్టి పెట్టారు. పవన్ వైపు అడుగులను ఆ దిశలో తొలి ప్రయత్నంగా చెప్పాలి

Related Posts