యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల సంగ్రామంలో అభ్యర్థులు తలమునకలై ఉండగా, కొందరు ఈ పండుగను వేడుకలా గడిపి ఎంతో కొంత నగదు మూటగట్టుకునే పనిలో ఉన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించినట్లు నటిస్తున్నా తెరవెనుక మరోలా రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షలు, పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయరాదనేది ఎన్నికల సంఘం నిబంధన. విచిత్రమేంటంటే గత కొన్నేళ్లుగా ఎన్నికల సరళిని పరిశీలిస్తే నిబంధనలు ఎంత కఠినతరం చేసినా ధన ప్రవాహం మాత్రం ఆగడం లేదు. గ్రామాల్లో నిర్వహించే వార్డు స్థాయి పదవికి రూ.లక్షలు, పట్టణాల్లో కౌన్సిలర్ పదవికి రూ.కోట్ల వంతున అభ్యర్థులు వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు ఉన్న తరుణంలో రాష్ట్ర, దేశస్థాయి ప్రతిష్ఠాత్మక పదవులైన ఎమ్మెల్యే, ఎంపీలకు రూ. లక్షలు రోజు వారీ ఖర్చులకే సరిపడవని పలువురు పేర్కొంటున్నారు. ఓటుకు నోటు తీసుకోకూడదని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఘోషిస్తున్నా ఓటుకు ఎంత వస్తుంది? ఇంట్లో ఉన్న 4 ఓట్లకు వచ్చే మొత్తం ఎంతనే లెక్కల్లో కొందరు తలమునకలవుతుండడం గమనార్హం.
వరికోత యంత్రాలపైనే రైతుల ఆధారం.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరికోతలు మొదలయ్యాయి. మరికొన్ని రోజులకు ఆ పనులు ముమ్మరం కానున్నాయి. ఇంతటి క్లిష్ట సమయంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి ఆయా పార్టీల కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటూ రోజువారి కూలీ అందుకుంటున్నారు. దీంతో వరి మాసూళ్లకు వారంతా వచ్చే అవకాశం లేదని భావించిన రైతులు వరికోత యంత్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.
జిల్లాలోని తీరప్రాంతంలో ప్రముఖంగా ప్రచారం నిర్వహిస్తున్న ఒక నియోజకవర్గంలో హారతులతో మహిళల ఆశీర్వచనాలు అందుకోవడానికే ఓ అభ్యర్థికి రోజుకు రూ.లక్ష ఖర్చవుతోందని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. హారతికి రూ. 500 నోటు పడుతుందని ఆ నోటా ఈ నోటా తెలియడంతో ఆ అభ్యర్థి అక్కడికి వస్తున్నట్లు తెలియడంతోనే ఇంటింటా హారతులతో మహిళలు స్వాగతం పలికేస్తున్నారంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు రోజుకు రూ. 300 నుంచి రూ. 400, హోటళ్ల నుంచి భోజన ప్యాకెట్లు అందుతున్నాయి. తీరప్రాంతంలో ముందస్తుగానే ప్రచారం ప్రారంభించిన ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికీ నోట్లు వెదజల్లక పోవడంతో ప్రచారానికి తొలి రోజు వచ్చిన వారు మరుసటి రోజుకు కనిపించకుండా పోతున్నారు. దీంతో వచ్చిన కొద్దిమందితోనే ఆ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశమున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వందలాది మందిని తరలించేందుకు కొందరు ముఠామేస్త్రీలుగా అవతారమెత్తుతున్నారు.
గతంలో రూ. 260 కోట్లు పైబడి.. 2014 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రచార పర్వంలో పెద్దగా ధనప్రవాహం లేకపోయినా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు రాత్రికి రాత్రే రూ.కోట్లు కుమ్మరించారు. కొందరు ఓటర్లు రాత్రివేళ ఇంటి తలుపులు తెరిచి ఎదురుచూడటం కొసమెరుపు. గ్రామాల్లో చీకటిమాటున వాహన వెలుగులు చూసి నగదు, మద్యం వచ్చేస్తుందని సంబరపడిన ఓటర్లున్నారు. అప్పట్లో జిల్లావ్యాప్తంగా రూ. 260 కోటక్లుపైగా పంపిణీ చేశారని అనధికార అంచనాలు. భీమవరంలో రూ. వెయ్యి, తాడేపల్లిగూడెం, ఉండిలో రూ. 700, ఏలూరులో రూ. 300, ఉంగుటూరు, పాలకొల్లులో రూ. 500, కొవ్వూరు, నరసాపురంలో రూ. 400, తణుకులో రూ. 800, నిడదవోలు, దెందులూరులో రూ. 600, చింతలపూడి, గోపాలపురం, పోలవరంలో రూ. 200 చొప్పున కొన్ని పార్టీల వారు ఓటర్లకు అందించారని అప్పట్లో అందరూ చెవులు కొరుక్కున్నారు.
మద్యం, నగదు పంపిణీ లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ఆదేశంతో అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడా నగదు, మద్యం తరలకుండా, పంపిణీ చేయకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రత్యేక పోలీసులను నియమించి రహదారులపై పహారా, గ్రామాల్లో విస్తృత తనిఖీలు, రహదారులపై వాహనాల తనిఖీలు చేపట్టారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసీ ఈసారి నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. గతంలోనూ ఇలాంటి పటిష్ఠ చర్యలు తీసుకున్నా కొందరు నాయకులు అధికారుల కళ్లు కప్పి విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేసి ఓటరును ప్రలోభపెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.