టీడీపీ నేతలపై ఐటీ దాడులకు నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆందోళనకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని అడిగినందుకు కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ శాశ్వతంగా ఉంటారని జగన్ పొగుడుతున్నారని మండిపడ్డారు.ఓ పథకం ప్రకారం జగన్ హైదరాబాద్ నుంచి కుట్రలను రూపకల్పన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారని ప్రధాని మోదీని చంద్రబాబు హెచ్చరించారు.భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. యూపీలో అఖిలేశ్, మాయావతి, కర్ణాటకలో కుమారస్వామి, తమిళనాడులో డీఎంకే నేతలపై ఐటీ దాడులతో బీజేపీ అపఖ్యాతి పాలయిందని విమర్శించారు. బీజేపీ చర్యలను ప్రజల్లో ఎండగట్టి వారిని చరిత్ర హీనులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.