
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిరీక్షణ ఫలించలేదు. ఈ సీజన్లో కోహ్లి జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. శుక్రవారం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో కోల్‌కతా చేతిలో పరాజయం పాలైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రి రసెల్ (48 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 7×6) నిర్దాక్షిణ్య ఇన్నింగ్స్ ఆడి.. ఆర్‌సీబీకి బాధాకర ఓటమి మిగిల్చాడు. అతడి ధాటికి 205 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు కోహ్లి (84; 49 బంతుల్లో 9×4, 2×6), డివిలియర్స్ (63; 32 బంతుల్లో 5×4, 4×6), స్టాయినిస్ (28 నాటౌట్; 13 బంతుల్లో 3×4, 1×6) మెరుపులతో బెంగళూరు 3 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.