టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కామిక్ పుస్తకంలా ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అద్దంలో చందమామలను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులు వలస వెళ్లేలా చంద్రబాబు చేశాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఇక తాను మాట్లాడినట్లు మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో టేపుపై విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ‘ఫేక్ ఆడియోలు, వీడియోలు ఇంకో 4 రోజులు ఇలాగే వదులుతారు. ప్రజల ఉమ్మిలో కొట్టుకుపోతూ గడ్డిపోచ పట్టుకుని ఎదురీదాలని చూస్తున్నారు. అన్నిటికీ దిగజారిన వ్యక్తులు మా వ్యక్తిత్వాలపై బురదజల్లడం ఊహించిందే. దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపండి. 2 గంటల్లో తేలుతుంది నిజమైనదో కాదో?’ అని సవాల్ విసరారు.