యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చి హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.