కొందరు వారసత్వంగా అయితే…మరికొందరు సామాజిక పరంగా అభ్యర్థులయ్యారు. ఈసారి ఎన్నికల్లో యువతరం ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా రాజకీయ అనుభవం లేని వారు సయితం బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండు పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలతో పాటు జనసేన కూడా బరిలో ఉంది. అయితే వైసీపీ, టీడీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే ప్రతిసారీ పార్లమెంటు అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అధినేతలు ఈసారి యువతరానికి, కొత్త వారికి పెద్ద పీట వేస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి.ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాయి రెండు పార్టీలు. జూనియర్లు పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు కాని, శాసనసభ గడప తొక్కని వారు సయితం పార్లమెంటులో కాలుమోపనున్నారు. కేవలం వారసత్వం, సామాజిక సమీకరణల ఆధారంగానే రెండు పార్టీలు కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం విశేషం. సాధారణంగా పార్లమెంటు సభ్యులంటే రాజకీయ అనుభవాన్ని చూస్తారు. కానీ ఈసారి అనుభవాన్ని పక్కన పెట్టేశాయి రెండు పార్టీలు.రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని చూసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్ ఉన్నారు. ఆయనకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. కేవలం సామాజిక కోణంలోనే జగన్ టిక్కెట్ ఇచ్చారు. యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మాగంటి మురళీ మోహన్ కోడలు మాగంటిరూప ను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి మురళిమోహన్ ఎంపీగా ఉండగా రూప నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజల బాగోగులు చూసుకునే వారు. కొంత మామయ్య తో ప్రజల్లో తిరగడంతో కొంత అనుభం రూపకు ఉంది. వీరిద్దరూ ఆర్థికంగా బలవంతులే కావడం విశేషం.అమలాపురం పార్లమెంటు నియోజవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్ ను బరిలోకి దించింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న హరీశ్ తండ్రి ఆశయాలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఈయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఇక ఇదే నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా చింతా కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఈమె ఐఆర్ఎస్ అధికారి భార్య. చింతా కృష్ణమూర్తి కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.మొత్తం మీద ఎవరూ గట్టి అభ్యర్థులు కారన్నది వాస్తవం. పార్టీల వేవ్ ను బట్టి వీరి విజయావకాశాలుంటాయనే చెప్పాలి. మరి ఎవరు వీరిలో లక్కీ ఫెలోస్ అనేది తేలాల్సి ఉంది.