YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ చూపు...సౌత్ వైపు

రాహుల్ చూపు...సౌత్ వైపు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాహుల్ గాంధీ ఒక ప్లాన్ ప్రకారమే కేరళ నుంచి బరిలోకి దిగారన్నది స్పష్టం అవుతుంది. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పట్టు కోల్పోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. సొంతంగానే అది ఎక్కువ స్థానాలను గెలుచుకునే సత్తా ఉంది. కాంగ్రెస్ ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ రెండంకెల సీట్లు రావడమూ కష్టమేనంటున్నారు. ప్రియాంకను రంగంలోకి దించినా పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు.బీహార్, మహారాష్ట్ర లాంటి చోట్ల పొత్తులతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రమే కొంత బలంగా కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో లోక్ సభలోనూ ఇక్కడ ఎక్కువ స్థానాలను సాధించాలన్నలక్ష్యంతో కాంగ్రెస్ నేతలున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈసారి గుజరాత్ లో ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే వీలుంది. భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప ఎక్కడా బలం లేదు. మోదీ ఉత్తరాది నాయకుడిగా ముద్రపడ్డారు. కేరళ కు వరద సాయంచేయడంలోనూ, తమిళనాడులో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడంలోనూ మోదీ వివక్ష చూపారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అందమైన కేరళ ప్రాంతం కకావికలమైనా మోదీ మనసు చలించలేదన్నది దక్షిణాది వాసుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే రాహుల్ కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఉత్తరాది నాయకుడిని కాదని, దక్షిణాది అంటే తనకు ఇష్టమని చెప్పేందుకే రాహుల్ గాంధీ అమేధీతో పాటు వయనాడ్ లో పోటీ చేస్తున్నారు. దీనివల్ల కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇస్తామని మ్యానిఫేస్టోలో ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పై ఉన్న ద్వేషాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు రాహుల్ ఈ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు. గతంలో నానమ్మ ఇందిరాగాంధీ దక్షిణాది రాష్టాలైన కర్ణాటకలోని చిక్కమగళూరు, తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఈసందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది

Related Posts