యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎంతో మంది అతిరథ మహారథులు ఎన్నికైన అక్కడి పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. కుల సమీకరణలు అధికంగా ప్రభావం చూపే ఈ నియోజకవర్గంలో ఈ సారి గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయన్నదే రాష్ట్ర రాజకీయ వర్గాలను అమితంగా ఆకర్షిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మళ్లీ టీడీపీ గూటికి చేరుకోవడంతో రాజకీయం ఇక్కడ రసవత్తరంగా మారింది. ఇక్కడ టీడీపీని గెలిపించాలని వంగవీటి రాధా..వైసీపీని గెలిపించాలని యలమంచిలి రవి విపరీతంగా కృషి చేస్తుండటం గమనార్హం. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్‌రావు పోటీ చేస్తుండగా ఇక వైసీపీ నుంచి కార్పొరేటర్ బొప్పన భావకుమార్, జనసేన నుంచి బత్తిన రాము, బీజేపీ నుంచి వంగవీటి రాజేంద్ర బరిలో ఉన్నారు1962లో ఏర్పడిన ఈ నియోజవర్గానికి మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా కాంగ్రెస్ విజయం సాధించింది.అయితే 1983లో ఇక్కడ టీడీపీ మొదటి సారిగా విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ హవా..మధ్యలో బీజేపీ ఒకసారి..2009లో పీఆర్పీ..2014మళ్లీ టీడీపీ ఇక్కడ విజయం సాధించడం విశేషం. 2009లో ఇక్కడి నుంచి గెలిచిన యలమంచిలి రవి ప్రస్తుతం వైసీపీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ అభ్యర్థి బొప్పన భావకుమార్‌ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంకు ఉండటం విశేషం. అదే సమయంలో జనసేన కూడా పోటీకి సిద్ధం కావడంతో ఇక్కడ కాపుల ఓట్లు చీలడంతో పాటు పవన్ ఇమేజ్ బలంగా ప్రభావం చూపే అవకాశం కనబడుతోందిమొదటి నుంచి ఈ నియోజకవర్గం కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా నిలుస్తోంది. అయితే స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నా ఈ ఒక్క అంశమే ఎన్నికల్లో ప్రధానాశంగా మారుతుండటం గమనార్హం. ఈ నియోజకవర్గంలో ఈ సారైతే చతుర్ముఖ పోటీ ఉంటుందని వినబడుతున్నా..వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే హోరాహోరీ కొనసాగుతుందని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. నియోజకవర్గంలో దాదాపు 3లక్ష లమంది ఓటర్లు ఉండగా కాపులు 55వేలు, కమ్మ ఓటర్లు 65వేల వరకు ఉన్నారు. మిగతా వర్గాల వారు బలంగానే ఉన్నారు. ఏపీకి వాణిజ్య రాజధానిగా మారిన విజయవాడకు తూర్పు నియోజకవర్గం గుండెకాయగా చెబుతారు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇక్కడ విజయం సాధించాలని తహతహలాడుతుండగా ఫలితం ఎలా ఉంటుందోనని సామాన్య జనం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారుటీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరోసారి పోటీలో ఉన్నారు. ఐదేళ్ల పాలనలో ఎవ్వరితోనూ వివాదాలు లేకుండా ఆయన తన పని తాను చేసుకున్నారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న భవకుమార్ గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మధ్యలో జగన్ ఆయన్ను పక్కన పెట్టి యలమంచిలి రవిని తెరమీదకు తెచ్చారు. చివరకు పీవీపీ పట్టుబట్టడంతో రవిని కాదని భవకుమార్‌కే సీటు ఇచ్చారు. టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న ఇద్దరు కమ్మ వర్గానికి చెందిన వారు కాగా జనసేన కాపు వర్గానికి సీటు ఇచ్చింది. దీంతో ఈ వర్గం ఓట్లు, పవన్ అభిమానులు కలిసికట్టుగా పనిచేస్తే జనసేన ఏదైనా షాక్ ఇస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టీడీపీ ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తున్నా ఎన్నికల వేళ ఏం జరుగుతుందో ? కూడా అంచనాలకు అందడం లేదు.