YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాఘవేంద్రపై దళపతి గురి

రాఘవేంద్రపై  దళపతి గురి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటక రాష్ట్రంలో మాండ్య పార్లమెంటు నియోజకవర్గం తర్వాత మరో ఆసక్తికరమైన నియోజకవర్గం శివమొగ్గ. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. మరోసారి కూడా యడ్యూరప్ప తనయుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు కావడంతో శివమొగ్గకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. రాఘవేంద్రను ఓడిస్తే యడ్యూరప్పను మానసికంగా దెబ్బతీయవచ్చన్నది కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ ఈ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టారు.ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, జేడీఎస్ లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయనే చెప్పాలి. ఎందుకంటే శివమొగ్గ యడ్యూరప్పకు కంచుకోట వంటి నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. యడ్యూరప్ప సొంత నియోజకవర్గం కావడంతో కమలం పార్టీ మరోసారి రాఘవేంద్రనే బరిలోకి దించుతుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ రాఘవేంద్రకు తగ్గడంతో కాంగ్రెస్ లో శివమొగ్గను కైవసం చేసుకోవచ్చన్న నమ్మకం ఏర్పడింది.అందుకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే దళపతి దేవెగౌడ శివమొగ్గ అభ్యర్థిగా మధు బంగారప్ప పేరును ప్రకటించారు. మధు బంగారప్ప మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు. గత ఎన్నికల్లో రాఘవేంద్రకు గట్టి పోటీ ఇచ్చారు. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేస్తే శివమొగ్గను గెలుచుకోవడం పెద్ద కష‌్టమేదీ కాదన్న అంచనాకు వచ్చారు. యడ్యూరప్పను గతంలో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప ఈ నియోజకవర్గంలో ముప్పు తిప్పలు పెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. జనతాదళ్ ఎస్ కు మద్దతుగా ఉన్న ఈడిగ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.ఇక రాఘవేంద్ర విషయానికొస్తే సొంత నియోజకవర్గం కావడం అనుకూలించే అంశం. లింగాయత్ వర్గం యడ్యూరప్పకు అండగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్పకు శివమొగ్గలో విజయంపై ఏమాత్రం సందేహం లేకపోయినా..కాంగ్రెస్, జేడీఎస్ లు మాత్రం తడాఖా చూపిస్తామంటున్నాయి. మాండ్యలో సుమలతకు మద్దతిచ్చినందుకు ప్రతీకారంగా శివమొగ్గలో యడ్యూరప్ప తనయుడిని ఓడించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల తనయుల మధ్య పోరులో ఎవరిది విజయమో చూడాల్సి ఉంది.

Related Posts