యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటి తనదైన ముద్ర వేసిన అందాల తార జయప్రద రాజకీయ రంగంలోనూ రాణించారు. తొలి దఫాలోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై ఏ సినీనటికీ లభించని అవకాశాలను అవలీలగా పొందారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ తాజాగా రాజకీయంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ రాజమండ్రి అందాల భామ వెంటనే పార్టీ టిక్కెట్ పొందారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తన పాత ప్రత్యర్థి ఆజంఖాన్ ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొననున్నారు. ఖాన్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బద్ధవైరమే ఉండేది. ఈ నియోజకవర్గంలో ముస్లింలదే ఆధిపత్యం.టాలీవుడ్, బాలీవుడ్ లో తిరుగులేని నాయకిగా తనదైన ముద్ర వేసిన జయప్రద అక్కడ కెరీర్ ముగిసిన అనంతరం రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా 1994లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆమెను రాజ్యసభకు పంపింది. వివిధ కారణాల వల్ల పార్టీ రెండోసారి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయలేదు. సొంత నియోజకవవర్గమైన రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఆమెకు ఇవ్వలేదు. దీంతో ఆమె జాతీయ రాజకీయాలపై ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పై దృష్టి సారించారు. బాలీవుడ్ తో మంచి సంబంధాలున్న అప్పటి సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది పార్టీలో చేరికకు దారితీసింది. అనతికాలంలోనే పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వద్ద పరపతి పెంచుకున్నారు. ఫలితంగా 2004 లోక్ సభ ఎన్నికలలో రాంపూర్ టిక్కెట్ ను సాధించారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, రాంపూర్ నవాబు కుటుంబానికి చెందిన బేగం నూరోబానును 85 వేల మెజారిటీతో ఓడించారు. అయిదేళ్లపాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల మన్ననలను పొందారు. ఫలితంగా 2009లో కూడా పార్టీ టిక్కెట్ ఆమెనే వరించింది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత ప్రత్యర్థి బేగం నూరోబానును 30 వేల మెజారిటీతో ఓడించగలిగారు. రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి జయప్రదకు కష్టాలు మొదలయ్యాయి.పార్టీ నాయకుడు ఆజంఖాన్ తో జయప్రదకు విభేదాలు తీవ్రమయ్యాయి. ములాయంకు సన్నిహితుడైన ఆజంఖాన్ ఆయనకు జయప్రదపై లేనిపోని చాడీలు చెప్పారు. జయప్రద – అమర్ సింగ్ లకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆజంఖాన్ జీర్ణించుకోలేకపోయారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ తో విభేదాల కారణంగా 2010లో జయప్రద, అమర్ సింగ్ లను పార్టీ బహిష్కరించింది. దీంతో ఆజంఖాన్ పై జయప్రద తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన ప్రోద్బలంతోనే తనను పార్టీ నుంచి ములాయం బహిష్కరించారన్నది ఆమె ఆరోపణ. ఆజంఖాన్ తనపై యాసిడ్ దాడి చేయించారని ఆరోపించారు. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను ఇంటర్నెట్ లో పెట్టారని కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు జయప్రద. 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఆజంఖాన్ రాంపూర్ నుంచి అసెంబ్లీకి గెలిచి అఖిలేష్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. తద్వారా పట్టు చిక్కించుకుని తద్వారా తన బహిష్కరణకు కారణమయ్యారన్నది జయప్రద అభియోగం. దీంతో చివరకు 2014 లోక్ సభ ఎన్నికలలో జయప్రద, అమర్ సింగ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారు. అంతకు ముందు 2012లో అమర్ సింగ్ తో కలసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో చివరకు అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. 2014 ఎన్నికలలో పశ్చిమ యూపీలోని చిజోర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇది బీఎస్పీ అధినేత్రి మాయావతి సొంత నియోజకవర్గం. దళితులు ఎక్కువగా ఉన్నారు.అయిదేళ్ల పాటు ఖాళీగా ఉన్న జయప్రద చివరకు బీజేపీలో చేరారు. వెనువెంటనే రాంపూర్ టిక్కెట్ ను సాధించారు. సమాజ్ వాదీ పార్టీ పాత నాయకుడు, జయప్రద ప్రత్యర్థి ఆజంఖాన్ ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించడం లేదు. దీంతో జయప్రద, ఆజంఖాన్ ల హద్య ప్రత్యక్ష పోరు జరగనుంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలసి పోటీ చేయడం, ముస్లింలు నియోజకవర్గంలో అధికంగా ఉండటంతో గెలుపు తనదేనని ఆజం ఖాన్ ధీమాగా ఉన్నారు. జయప్రద కూడా ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో తనకున్న అనుబంధం, సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకు, మోదీ ఇమేజ్ తనను విజయతీరాలకు చేరుస్తాయని విశ్వాసంతో ఉన్నారు. అమర్ సింగ్ లాబీయింగ్ కూడా తన గెలుపునకు దోహదపడుతుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈ నియోజకవర్గంలో సౌర్, రాంపూర్, మిలక్, బిలాస్ పూర్, చామ్ రే అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం మీద ఇక్కడ ప్రతిష్టాత్మక పోరు జరుగుతోంది. రెండు పార్టీలూ, అభ్యర్థులూ ఎన్నికను వ్యక్తిగత పోటీగా భావిస్తున్నారు. పార్టీలు కూడా వారికి మద్దతిస్తున్నాయి. రాంపూర్ లో గెలిస్తే జయప్రద రాజకీయంగా రెండో ఇన్నింగ్స్ లో సక్సెస్ అయినట్లే…..!!