YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

 సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే  ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం. వాహన సేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీధర్, ఏఈవో  తిరుమలయ్య, సూపరింటెండెంట్  జి.రమేష్,  కంకణభట్టార్  ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ వై.రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Posts