యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ పై ఆయన సెటైర్లు వేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఈ గడ్డపై లోకేశ్ ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక్కడ తిరిగింది లేనేలేదని చెప్పారు. తన పార్ట్ నర్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరని... చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వారి పార్ట్ నర్ ప్రచారం చేయరని విమర్శించారు. ఐదు ఏళ్ల చంద్రబాబు పాలన చూశాక మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇక్కడే మీ పక్కనే ఆర్కె ఉన్నారు. ఇక్కడ లోకల్ హీరో గురించి మీ అందరికీ తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు. కాడి పట్టుకుని దున్నుతాడు. రైతుల కోసం కోర్డుకూ వెళ్లాడు. చంద్రబాబు ప్రలోభాలకూ లొంగలేదు. నా సోదరుడు మీ కోసం 5 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఇక ఈ 5 ఏళ్లలో ఈ నేల మీద కాలు కూడా పెట్టని వ్యక్తిని ఇక్కడ టీడీపీ నిలబెట్టింది. ఇప్పటికే ఇష్టానుసారం భూములు ఆక్రమిస్తున్నారు. ఆయనను గెలపిస్తే ఇక్కడ భూములేవీ మిగలవు. బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించినట్లే మంగళగిరిలో ఆయన కొడుకును ఓడించాలని నిర్ణయించాలని కోరుతున్నాను. ఇక్కడే అనేక కుంభకోణాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని అయన ఆరోపించారు. గతంలో ఇక్కడ సీఎం కానీ, ఆయన కొడుకు కానీ తిరగలేదు. మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే ఆర్కెకే ఓటు వేస్తే మీ ఆస్తులు కాపాడతాడు. మీకు సేవలు చేస్తాడు. నా క్యాబినెట్లో మంత్రిగా ఉంటాడు. దుష్ట చతుష్టయం, హిట్లర్ మంత్రి గోబెల్స్ను చూసినా.. రెండు పేర్లు వింటున్నా మన రాష్ట్రంలో మీకెవరైనా గుర్తుకు వస్తున్నారా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 గుర్తుకు వస్తోందా? చంద్రబాబు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్నా, వారిని నమ్మించడానికి మోసం చేస్తూ బాకా ఊదుతున్న ఈ గోబెల్స్ కుట్రలను దయచేసి గమనించండి. 10 ఎల్లో మీడియా ఛానళ్లు మైకులు పట్టుకుని ప్రచారం చేసినంత మాత్రాన బాబు చేసిన మోసాలు, వంచనలు మంచి పనులు అయిపోతాయా? ఈ 5 ఏళ్ల పాలనలో రైతులను దగా చేసింది ఎవరు? రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసింది ఎవరు? రుణమాఫీ చేస్తానని పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలను దగా చేసింది ఎవరు? చివరకు పిల్లలను దగా చేసింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. 2016, సెప్టెంబరు 8న అర్దరాత్రి పూట హోదా వద్దు, ప్యాకేజీ కావాలని కేంద్రంతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరు? ప్యాకేజీ ఉన్నట్లుగా అసెంబ్లీలో రెండుసార్లు, మండలిలో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేసింది ఎవరు?. మా రాష్ట్రానికి హోదా అవసరం లేదు. ఏటా కేవలం రూ.3500 కోట్లు ఇస్తే చాలని కేంద్రానికి లేఖ రాసింది ఎవరు? కృష్ణపట్నం రేవు యాజమాన్యంతో కుమ్మక్కై దుగ్గరాజుపట్నం పోర్టు వద్దన్నది ఎవరు? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, హైదరాబాద్పై మనకు 10 ఏళ్ల హక్కు ఉన్నా, వదిలేసి పారిపోయి వచ్చింది ఈ బాబు కాదా? – చివరగా, జగన్ ఇల్లు ఎక్కడ కట్టారని ఎవరైనా అడిగితే, తాడేపల్లిలో అని చూపుతారు. అదే చంద్రబాబు ఇల్లు ఎక్కడ కట్టాడంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అని చెబుతారు. రాష్ట్రంలో సొంత ఇల్లు ఎవరికి ఉంది? అద్దె ఇంట్లో ఉన్నది ఎవరు? అన్నది ఇక వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ 5 ఏళ్లు, మోసాలు చూశారు. ఎన్నికలు వచ్చే సరికి అవి క్లైమాక్స్కు చేరుతాయి. మిమ్మల్ని ప్రలోభపెట్టేందుకు ఇక్కడ ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు.