YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

16 సీట్లతో కేసీఆర్‌ ప్రధాని అవుతారా?: అమిత్‌షా

    16 సీట్లతో కేసీఆర్‌ ప్రధాని అవుతారా?: అమిత్‌షా
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని అవుతానని పగటి కళలు కంటున్నారని,16 స్థానాల్లో తమను గెలిపించాలని తెరాస నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ దేశ ప్రధాని కాగలుగుతారా?అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.. శంషాబాద్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ దేశం మొత్తం మోదీ నామస్మరణ వినిపిస్తోందని, మోదీయే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇటు తెరాసపైనా, అటు కాంగ్రెస్‌ పైనా విమర్శలు గుప్పించారు.‘‘తెలంగాణ అభివృద్ధి భాజపా కట్టుబడి ఉంది. హైదరాబాద్‌ మెట్రో కోసం కేంద్రం రూ.1600 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ వంటి కేంద్ర సంస్థలను మంజూరు చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఏం ఇచ్చారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినం జరిపే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీకి సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారు. మంచి మెజార్టీతో గెలిచి కూడా రెండు నెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు’’ అని ఎద్దేవాచేశారు.
‘‘పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దేశానికి ఏమీ చేయలేకపోయింది. మాల్యావంటి వారు కాంగ్రెస్‌ హయాంలోనే భారీగా బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఉగ్రవాదులు ఘాతుకానికి 40 మంది సైనికులు చనిపోతే, పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడారు. దేశం మొత్తం గర్విస్తున్న సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా తక్కువ చేసి మాట్లాడారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ కోరుతోంది. కాంగ్రెస్‌ మిత్రపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ను రాహుల్‌ గాంధీ సమర్థిస్తారా?’’ అని రాహుల్‌ను అమిత్‌షా ప్రశ్నించారు.

Related Posts