యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ సెక్రటేరియేట్ అధికారులు ఏమనుకుంటున్నారో ఏమో కానీ తమ ఆధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ లో రెండు రోజుల కిందట ఒక పరిశీలన జరిపారు. అక్కడ భవనాలు ఎలా ఉన్నాయి? అందులో ఆఫీసులకు పనికి వచ్చేవి ఎన్ని అనేది ఆ పరిశీలన. చంద్రబాబునాయుడు హుటాహుటిన హైదరాబాద్ లోని సెక్రటేరియేట్ ను ఖాళీ చేసి అమరావతి వెళ్లిపోయిన తర్వాత మెయింటేనెన్సు లేక అన్ని భవనాలు శిధిలం అయిపోయాయి. అక్కడ అంతా పిచ్చిమొక్కలు మొలిచి పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. కొన్ని భవనాలు కుక్కలకు ఆవాసంగా మారిపోయాయి. విరిగిపోయిన ఫర్నీచర్ తో కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వానికి అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ పై శ్రద్ధ ఎందుకు కలిగింది అనేది సందేహం కదా? దీనికి ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. జరుగుతున్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త సిఎం కోసం ఛాంబర్ సిద్ధం చేయమని ఆదేశాలు వెలువడ్డాయట. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు ఏపికి ఇక్కడ హక్కు ఉంది. అయితే అనివార్య కారణాలతో చంద్రబాబునాయుడు హైదరాబాద్ ను వదిలేసి హడావుడిగా అమరావతి వెళ్లిపోయారు.అమరావతి లో తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసుకుని ఆయన అక్కడకు వెళ్లిపోయిన తర్వాత హైదరాబాద్ లోని సిబ్బందిని కూడా బలవంతంగా తరలించుకుని వెళ్లిపోయారు. చాలా మందికి ఇష్టం లేకపోయినా ఉద్యోగరీత్యా అమరావతికి తరలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎన్నికలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపించిందో ఏమో గానీ కొత్త సి ఎం కోసం హైదరాబాద్ సెక్రటేరియేట్ లో ఒక ఛాంబర్ సిద్ధం చేయమని ఆదేశాలు వచ్చాయట. దాంతో ఇక్కడి ఎస్టేట్ అధికారులు పరిశీలన జరిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు సిఎం కాగానే దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ సెక్రటేరియేట్ లోని ఎల్ బ్లాక్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అయితే అన్నింటిని వదిలేసి ఆయన వెళ్లిపోయారు. తాజాగా కే బ్లాక్ ను లేదా జె బ్లాక్ ను సిఎం కోసం సిద్ధం చేయాలని ఎస్టేట్ అధికారులు ఒక అంచనాకు వచ్చారని అంటున్నారు. తర్వలో పనులు మొదలు పెట్టేందుకు సంసిద్ధమౌతున్నారు.