
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
చెపాక్ మైదానంలో చెన్నై జట్టు మరోసారి విజయకేతనం ఎగురవేసింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు సూపర్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్‌కతా పరుగులు చేయడంలో దారుణంగా చతికిలపడింది. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ (44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా హర్భజన్, తాహిర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 3 ఫోర్లతో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నరైన్‌కు 2వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దీపక్ చాహర్‌కు లభించింది.