యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. ఏపీ, తెలంగాణలో సహా.. మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు, తెలంగాణలో పదిహేడు స్థానాలకూ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకూ.. పోలింగ్ జరుగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని హోరెత్తించారు. . వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో, జమ్ము కశ్మీర్, మేఘాలయల్లో రెండేసి స్ధానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 8 స్ధానాలకు, మహారాష్ట్రలో ఆరు స్ధానాలకు, అస్సోం, ఉత్తరాఖండ్‌లో ఐదేసి స్ధానాలకు, బీహార్, ఒడిస్సాలో నాలుగేసి స్ధానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వాహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాల పరిధిలోని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధన ప్రవాహంతో పాటు మద్యం, ఇతర ప్రలోభ పర్వాలను అడ్డుకోనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆయా నియోజకవర్గాలను వదిలి వెళ్లాలంటూ ఆదేశించింది. దీంతో పాటు బల్క్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది. పత్రికల్లో ప్రకటనలు, డిజిటల్ ప్రచారంపై కూడా నివేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసీ నుంచి కొన్ని అనుమతులు తీసుకుని ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినా… బందోబస్తు విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం పట్టనట్లుగా వ్యవహరించింది. ఎన్నికల బందోబస్తు కోసం 300 కంపెనీల భద్రత బలగాలను కోరగా.. 197 కంపెనీలే వచ్చాయి. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర భద్రత బలగాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఈవీఎంలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫోటో ఓటరు గుర్తింపుకార్డులు, ఓటరు చీటీల పంపిణీ కూడా పూర్తయింది. విశాఖపట్నం జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న 14 పోలింగ్ కేంద్రాలను మరో చోటకు తరలించారు. విశాఖలో ఓ హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచటంతోపాటు సీనియర్ పోలీసు అధికారిని పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో చైతన్యం ఎక్కువ. గత ఎన్నికల్లో ఏపీలో 78 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి 85 శాతంకంటే ఎక్కువయ్యే పోలింగ్ నమోదవుతుందని.. ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఓటరు జాబితాల్లో అక్కడక్కడా తప్పులున్నప్పటికీ.. అర్హలైన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకునేలా.. ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపుల్ని ఎల్లుండి పోలింగ్ ముగిసే వరకూ .. మూసివేస్తారు.