యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే తాము చూస్తూ కూర్చోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈసీ వ్యవహార శైలిపై బుధవారం సీఎం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతి పత్రం అందించారు.ఎన్నికల ప్రధానాధికారిని కలవడం చరిత్రలో మొదటిసారి జరిగిందని చంద్రబాబు అన్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోని 22 రాజకీయ పార్టీలు దిల్లీలో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఈవీఎంలపై నమ్మకం లేదు.. పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలని ఫిర్యాదు చేశాం. కనీసం వీవీప్యాట్ స్లిప్పులను కనీసం 50 శాతం లెక్కించాలని కోరాం. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లాం. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని ఈసీ సుప్రీంకోర్టుకు అసత్యాలు నివేదించింది. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించేటప్పుడు కూడా ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రోజులోనే విడుదలయ్యేవి. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఆరు రోజులు ఎలా పడుతుంది?.’’ అని ప్రశ్నించారు.ఈసీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును బదిలీ చేసిందని, ఆయనకు ఎన్నికలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రధానికి భద్రత కల్పిస్తున్న ఐబీ అధికారులను ఎందుకు బదిలీ చేయలేదని ధ్వజమెత్తారు. కొంత మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. కడప జిల్లాలో వివేకా హత్య జరిగాక ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్పీని బదిలీ చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి, ఎన్నికల వ్యవహారాలను చూసే సీఎస్‌ను కూడా ఇష్టప్రకారం బదిలీ చేశారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే బదిలీలు జరగడం దారుణమని అన్నారు. ఐటీ దాడులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ‘‘ఆళ్లగడ్డలో కరెన్సీ విసిరేశారని తెదేపా ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? విజయసాయిరెడ్డి, అనిల్ యాదవ్ వంటి వాళ్లు ఈసీకి ఫోన్లో చెప్పిన ఆడియో టేపులు ఉన్నాయి. పరిశీలించండి.’’ అని సీఎం అన్నారు.
ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విశ్రాంత అఖిల భారత సేవల అధికారులు 65 మంది రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్, జగన్ మాతోనే కలిసి ఉంటారని మోదీనే స్పష్టం చేశారని చంద్రబాబు అన్నారు.