యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదలచేయనున్నట్లు ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్ విధానం అమలు చేయగా.. ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేయనున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా ఇంటర్ బోర్డు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,423 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది ఏప్రిల్ 13న ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 62 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ద్వితీయ సంవత్సరంలో 73.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.