గాజువాక ఇపుడు హాట్ సీటుగా ఉంది. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి అటువైపుగా మళ్ళింది. ఇదిలా ఉండగా గాజువాకలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. అయితే జనసేన పోటీ ఏ ధైర్యంతో చేస్తోందన్నది అందరికీ చర్చగానే ఉంది. కాపులు ఎక్కువగా ఉన్నారని, యువత ఓట్లు, పవన్ క్రేజ్ ఇలా అన్ని రకాల సమీకరణలు కూడా తెర మీదకు తెస్తున్నారు. అయితే లోపాయికారిగా టీడీపీలో అసమ్మతి వర్గాలు, కొందరు సమ్మతి వర్గాలు కూడా పవన్ గెలుపు కోసం పనిచేస్తాయని అంటున్నారు.
టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీద పార్టీలోనూ బయటా కూడా వ్యతిరేకత ఉంది. ఎన్నికల వేళ రెండు వర్గాలు కలసిపోయినట్లుగా ఉన్నా పల్లా మళ్ళీ గెలవకూడదని ఓ వర్గం పార్టీలో బలంగా పనిచేస్తోందని అంటున్నారు. ఆ వర్గం జనసేనకు మద్దతు ఇవ్వొచ్చునని అంటున్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు విజయావకాశాలు బాగా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఇప్పటికి ఎన్నో మార్లు విశాఖ వచ్చినా గాజువాక వెళ్ళలేదు. దాంతో పాటు పవన్ అక్కడ పోటీ కాబట్టి ఆయనకు పరోక్షంగా టీడీపీ మద్దతు ఉంటుందని ఓ ప్రచారం అయితే సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం ప్రచారం బాబు చేయకపోవడం విశేషమైతే పవన్ కోసం బాబు బలి చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.ఇక అంతా చెప్పుకుంటున్నట్లు క్రాస్ ఓటింగ్ కనుక జరిగితే ఎవరికి లాభమన్న చర్చ వస్తోంది. వైసీపీ తన ఓటు బ్యాంక్ పదిలంగానే ఉంచుకుంది. గత ఎన్నికల్లో 75 వేల ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఈసారి లక్ష ఓట్లు వస్తాయని అంటున్నారు. గాజువాక మొత్తం ఓటర్లు రెండున్నర లక్షల మంది. దాంతో తన గెలుపు ఖాయమని ఆయన అంటున్నారు. ఇక క్రాస్ ఓటింగ్ టీడీపీలో జరిగితే అది జనసేనకే పరిమితం కాదని, అక్కడ ఎమ్మెల్యే పొడ గిట్టని వర్గంతో పాటు హై కమాండ్ లోపాయికారి వ్యవహారంపై గుస్సా అవుతున్నా వారంతా వైసెపీ వైపుగా మళ్ళుతారని అంటున్నారు. ఈ మొత్తం క్రాస్ ఓటింగ్ ఎపిసోడ్లో లాభపడేది వైసీపీ అని కూడా విశ్లేషిస్తున్నారు, చూడాలి మరి.