రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంలు మొరాయించాయి. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గొపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఉదయం ఐదున్నర గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభించారు. అన్ని పార్టీల ఏజెంట్లతో ఈ మాక్పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ద్వివేదీ తెలిపారు. అలాగే, 28 వేల కేంద్రాల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.కృష్ణాజిల్లాలో ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ అధికారులు నిర్వహించారు. ఒక్కొక్క ఈవీఎం కు యాభై ఓట్లు చొప్పున మాక్ పోలింగ్ నిర్వహించారు. అప్పుడు పని చేసిన ఈవీఎంలు తదుపరి మొరాయించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణితో కలిసి చంద్రబాబు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్, కొద్దిసేపటిక్రితం పులివెందులలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్ లో ఓటేశారు. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ వెళ్లే సమయానికే పోలింగ్ బూత్ వద్ద పలువురు ఓటర్లు ఉండటంతో, కాసేపు జగన్ దంపతులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది