పోలింగ్ వేళ ఏపీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. భారీ స్థాయిలో ఓటర్లు చాలా చోట్ల ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా… మరి కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తప్పడం లేదు. అందుకు సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి.ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నరసరావు పేట నియోజకవర్గంలోని యలమందలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా సమాచారం. అక్కడ తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు బాహాబాహీకి దిగినట్టుగా తెలుస్తోంది.
అక్కడ ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వలేదు. అది పోలింగ్ స్టేషన్ బయట జరిగిన సంఘటన అని అంటున్నారు. ఇక అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద కూడా దాడి జరిగినట్టుగా సమాచారం. ఆయన సెల్ ఫోన్ తో పాటు ఘటనను చిత్రీకరిస్తున్న కెమెరా కూడా ధ్వంసం అయ్యిందని తెలుస్తోంది.ఇక విశాఖ - చిత్తూరు - కడప జిల్లాల్లో కూడా చెదరుమదరు సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రతి సారీ కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా అక్కడ అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పోట్ల దుర్తిలో టీడీపీ నేత సీఎం రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటు పై చేయి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమా టికెట్ల కోసం క్యూల్లో ఉండటానికి ఇష్టపడని వారు.. ఓటు విషయంలో మాత్రం ఎంతో ఉత్సాహంగా క్యూ లైన్లకు పేరుకొంటున్నారు.ఉదయం పూట భారీగా పోలింగ్ నమోదు అవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఏపీలో పోలింగ్ శాతం ఎనభైని చేరేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదు అయినట్టుగా ఉంది. ఈ సారి ఆ శాతం మరింత పెరగడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. పెరిగే పోలింగ్ శాతం ఎన్నికల ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంని చెప్పవచ్చు.అందులోనూ ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటూ ఎంతో కీలకం అవుతుంది. నాలుగైదు శాతం ఓట్ల పోలింగ్ పెరిగిందంటే.. ఫలితాలు మరింత ఆసక్తిని రేపుతాయి. ఈ సారి యువ ఓటర్ల నమోదు బాగానే పెరిగింది. ఆ ప్రభావం కూడా పోలింగ్ శాతం మీద ప్రభావం చూపవచ్చు.ఇక పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీ పై వ్యతిరేకతకు నిదర్శనం అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఓటర్లు ఉత్సాహవంతంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. అక్కడి వరకూ అభినందించి తీరాల్సిందే!