30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇప్పటికే మూడు గంటల సమయం వృథా అయిన కారణంగా ఈవీఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి ఆయన లేఖను రాశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతటి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అది వైసీపీకి వెళుతున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు.ఈవీఎంల దుర్వినియోగంపై ఎప్పటి నుంచో చెబుతున్నా.. కేంద్రం, సీఈసీ పట్టించుకోలేదని, బ్యాలెట్‌తో ఏ సమస్యా ఉండదని చెప్పినా వినలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంల వల్ల జరిగే నష్టాన్ని ఇప్పటినైనా గుర్తించాలన్నారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో... మహిళలు బారులు తీరడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో పాటు వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. హక్కుల కోసం పోరాడలంటే ముందుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు. కాగా ఈవీఎంలపై రివ్యూ పిటిషన్ వేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలియవచ్చింది.