ఏపీలో పోలింగ్ శాతం క్రమంగా పుంజుకుంటోంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పోలింగ్ శాతాలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. కడప జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం.. వివిధ జిల్లాల్లో పోలింగ్ శాతం కింది విధంగా ఉంది. కడప జిల్లాలో 44%, శ్రీకాకుళంలో 37.92%, విజయనగరంలో 53.19%, విశాఖపట్నంలో 36.71%, తూర్పుగోదావరిలో 41.21%, పశ్చిమగోదావరిలో 37.51 %, కృష్ణాలో 36.42%, గుంటూరులో 36.08%, ప్రకాశంలో 41.48%, నెల్లూరులో 41.04%, చిత్తూరులో 42.60%, కర్నూలులో 40%, అనంతపురంలో 38.80% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం చెదరలేదు, బెదరలేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. తాడిపత్రిలో ఇద్దరు కార్యకర్తలు మరణించారు.