సైన్స్ చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గత కొన్ని దశాబ్దాలుగా కేవలం శాస్త్రవేత్తల ఊహల్లోనే ఉన్న కృష్ణబిలం (బ్లాక్‌హోల్) చిత్రం మానవాళి ఎదుట ఆవిష్కృతమైంది. అంతరిక్ష నౌకలు, టెలిస్కోపులకు కూడా దొరకని ఆ బ్లాక్‌హోల్ ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. ది ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ (ఈహెచ్‌టీ), సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ షెప్ డోలెమ్యాన్.. తొలిసారి కృష్ణబిలానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశాయి. భూమి నుంచి 5 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఎం87 అనే నక్షత్రమండలంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలం ఫొటోను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ చారిత్రకఘట్టం తాలూకు వివరాలను వెల్లడించారు. చీకటిమయంగా ఉన్న కేంద్రభాగం, చుట్టూ నారింజ రంగు జ్వాలలతో, శ్వేతవర్ణపు వేడి వాయువులు, ప్లాస్మాతో ఈ కృష్ణబిలం అద్భుతంగా కనిపిస్తూ ఉంది. శాస్త్రవేత్తలు విడుదల చేసిన 'కృష్ణబిలం' చిత్రం.. ఇప్పటివరకూ సైన్స్ ఆర్టిస్టులు ఊహించిన బ్లాక్‌హోల్ మాదిరిగానే ఉండటం విశేషం. హవాయి, అరిజోనా, స్పెయిన్, మెక్సికో, చిలీ, దక్షిణధ్రువం మొదలైన దేశాలు, ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 రేడియో టెలిస్కోపుల ద్వారా 2017 ఏప్రిల్‌లో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఫలితంగా కృష్ణబిలం ఫొటోలను తీసి, వాటిని ఒకదానితో ఒకటి కలిపి మొత్తం ఒకే ఫొటోగా రూపొందించినట్లు ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ డైరెక్టర్ షెఫర్డ్ డొలెమన్ చెప్పారు. ఈ వివరాలు కృష్ణబిలం ఫొటో ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురితమైనట్లు ఆయన తెలిపారు. కృష్ణ బిలాన్ని చిత్రీకరించడం అనేది ఒక్క టెలిస్కోపు వల్ల అయ్యే పనికాదు. ఇందుకోసం హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ షెపర్డ్ డోల్‌మన్ నేతృత్వంలో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇందులో భాగంగా హవాయ్, ఆరిజోనా, స్పెయిన్, మెక్సికో, చిలీ, దక్షిణ ధ్రువం వద్ద ఉన్న 8 టెలిస్కోపులను అనుసంధానం చేయడం ద్వారా ‘ఈవెంట్ హొరైజన్ టెలిస్కోపు (ఈహెచ్‌టీ)’ అనే ఒక భారీ సాధనాన్ని తయారుచేశారు. దీన్ని ప్రయోగం కోసం వినియోగించారు. విడివిడి భాగాలతో ఏర్పడ్డ ఒక భారీ అద్దం తరహాలో ఉన్న ఈ టెలిస్కోపు 12 వేల కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక వర్చువల్ అబ్జర్వేటరీని ఏర్పరిచాయి. ఇది సుమారు భూమి వ్యాసానికి సమానం. ఈహెచ్‌టీని 2017 ఏప్రిల్‌లో అనేక రోజుల తరబడి శాజిటేరియస్-ఎ, ఎం87 అనే నక్షత్రమండలంలోని కృష్ణబిలంపైకి శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు. అయితే శీతాకాలంలో తలెత్తిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ ధ్రువ టెలిస్కోపు నుంచి డేటా సేకరణ సాధ్యపడలేదు. దీనికోసం ఆరు నెలలు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు 2017 డిసెంబర్ 23న డేటా అందింది. డేటా భారీగా ఉండటం వల్ల ఇంటర్నెట్ ద్వారా పంపడం సాధ్యంకాలేదు. దీంతో వందలాది హార్డ్ డిస్క్‌లలో డేటాను నిల్వచేసి, సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించారు. ఈ డేటాను డేటాను అధ్యయనం చేసి.. ఒక పూర్తిస్థాయి చిత్రంగా మలచడానికి మరో ఏడాది పట్టింది. చివరకు 'ఎం87'లోని కృష్ణబిలం చిత్రం స్పష్టంగా ఆవిష్కృతమైంది. శాజిటేరియస్-ఎ చాలా క్రియాశీలంగా ఉండటంతో స్పష్టమైన చిత్రం లభించలేదు. ఆ తర్వాత కచ్చితత్వం కోసం నాలుగు భిన్న బృందాలతో నాలుగుసార్లు పరిశీలన చేయించారు. ప్రతిసారీ ఇదే చిత్రం రావడంతో.. ఆ కృష్ణబిలం తాలుకు చిత్రాలను తాజాగా విడుదల చేశారు.'ఎం87' నక్షత్రమండలం మనకు 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఉంది. దీనితో పోలిస్తే శాజిటేరియస్-ఎ భూమికి కేవలం 26 వేల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. ఎం87 నక్షత్ర మండలంలోని కృష్ణబిలాన్ని ఫొటో తీయడమంటే చంద్రుడి మీదున్న చిన్న గులకరాయిని క్లిక్‌మనిపించడంతో సమానం. కృష్ణబిలంలో ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే అది అంతపెద్దగా ఉంటుంది. తాజాగా తీసిన ఎం87లోని కృష్ణబిలం వెడల్పు 40 బిలియన్ కిలోమీటర్లు. భూమితో పోలిస్తే ఇది 30 లక్షల రెట్లు ఎక్కువ. సూర్యుడితో పోలిస్తే దీని ద్రవ్యరాశి 650 కోట్ల రెట్లు అధికం.