యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కృష్ణానదిలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. మంగళవారం బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగులకు నీరు తగ్గిపోయింది. రిజర్వాయర్ పైభాగంలో గతంలో ఎప్పుడూ కనబడని మట్టిదిబ్బలు కనిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలకు బ్యారేజీ నీరే ఆధారం కావడంతో ఈ వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరిలోనూ నీటి మట్టం తక్కువగా ఉండటంతో పట్టిసీమ లిఫ్ట్ నడవడం లేదు. దీంతో ప్రకాశం బ్యారేజీలో మంగళవారం నాటికి నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద మధ్యలో చిన్నపాటి దిబ్బలు కూడా బయటకు కనిపిస్తున్నాయి. నీటిమట్టం చాలా తక్కువగా ఉందని, పైభాగం నుండి వదిలితే మినహా బ్యారేజీ లెవలు పెరగదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పైభాగం లో నాగార్జునసాగర్, శ్రీశైలంలోనూ నీటిమట్టం గణనీయం గా తగ్గింది. దీనికితోడు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా పెద్దఎత్తున నీటిని తోడుతోంది. పులిచింతలలోనూ నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలక్యూసెక్కులు మాత్రమే అక్కడ ఉన్నాయి. శ్రీశైలంలో 41 టిఎంసిలు, నాగార్జునసాగర్‌లో 137.52 టిఎంసిలకు చేరుకున్నాయి డెడ్ స్టోరేజీ దశలో ఉన్నాయి. తుంగభద్రలోనూ ఐదు టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. పట్టిసీమ రన్ చేస్తే తప్ప బ్యారేజీలోకి నీరొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. నాగార్జునసాగర్ నుండి 7167 క్యూసెక్కులు వదులుతున్నా అవి బ్యారేజీకి చేరుకునేప్పటికీ సగానికిపైగా తగ్గిపోతాయి. విజయవాడ నగరం పూర్తిగా కృష్ణానదిపై ఆధారపడింది. ఈ వేసవిలో నీటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.