యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధిగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం సంగతేమో కానీ అక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు నెత్తి మీద పిడుగు పడ్డట్టైంది. పవన్ పోటీ అంటే ఎక్కడో ఏమో అనుకున్న వారికి ఏకంగా తమ ఇలాకాలోనే పవన్ వచ్చి వాలిపోవడం మింగుడుపడడం లేదు. దాంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ అభ్యర్ధుల ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉన్నాయని టాక్. పవన్ పోటీ చేసినా ఫరవాలేదు ఎదిరించి నిలబడగలను కానీ టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పైనే ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రగిలిపోతున్నారుట. కనీసం అధినాయకుడు నైతిక మద్దతు ఇచ్చి ప్రచారం కూడా చేయకపోవడాన్ని పల్లా వర్గీయులు పూర్తిగా తప్పు పడుతున్నారుట.ఈ పరిణామం ఇపుడు యాదవ ముసలానికి దారి తీసేట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. పల్లా శ్రీనివాస్ ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకుడు. ఏరి కోరి పవన్ ఇక్కడ సీటు ఎంచుకుంటే తమను గాలికి వదిలేసి బలి పశువును చేయడం న్యాయమా అని విశాఖ జిలాలొనే బలమైన యాదవులు ఇపుడు టీడీపీ మీద గుస్సా అవుతున్నారుట. జిల్లాలో ఇచ్చిన ఏకైక సీటుని ఇలా బలి పెడతారా అంటూ హై కమాండ్ మీద మండిపడుతున్నారట. ఇది చివరకి ఎటు దారితీస్తుందో ఏ ప్రమాదం ముంచుకుని వస్తుందోనని టీడీపీ కి చెందిన సిట్టింగులు కూడా ఇపుడు కలవరపడుతున్నారుట.ఇక మరో వైపు వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డికి ఇవి దాదాపుగా చివరి ఎన్నికలు 2009 నుంచి ఇప్పటికి మూడు మార్లు ఎమ్మెల్యే అవాలని ఆయన చేసిన ప్రయత్నం అలాగే ఉండిపోయింది. ఈసారి అవుదామనుకుంటే ఏకంగా సినీ సెలిబ్రిటీ వచ్చి గాజువాకలో పోటీ చేస్తున్నారు. దీంతో తిప్పల ఇపుడు జనాల దగ్గరకు వచ్చి సానుభూతి మంత్రాన్ని పఠిస్తున్నారుట. జగన్ గాజువాకలో నిర్వహించిన సభకు అనూహ్యంగా జనం తరలి రావడంతో పాటు, వచ్చిన వారు బాగా స్పందించడంతో తిప్పల్ల ఇపుడు ఒకింత ధైర్యంగా ముందుకు సాగుతున్నారుట. తనను గెలిపించాలని, తాను చివరి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్నారు. మరి ఇపుడు సీన్ చూస్తే టీడీపీ నిర్వేదంలో ఉంది. వైసీపీ సానుభూతి మంత్రం పఠిస్తోంది. ఈ పరిణామాలు పవన్ లో ధీమా పెంచుతున్నాయా అనిపిస్తోంది