యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అనంతపురం జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే తీవ్రమైన ఎండలు ఉండటంతో అనేక అగచాట్లకు లోనవుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, పిల్లలతోపాటు నడి వయస్కుల వారు సైతం ఎండవేడిమికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఈ సంవత్సరం తీవ్రమైన స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నమోదైంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అనంతపురము జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు 42 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు పైగా ప్రతి రోజు ఎండ కాస్తోంది. దీంతో జనం బయటకు రాలేని పరిస్థితి చోటు చేసుకొంది. ఉదయం 11 గంటలకే వీధులన్ని నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. సీతల పానీయాలు, ఖర్బుజా, చెరుకు రసం కోసం పరుగులు పెడుతున్నారు. ఒక వైపు ఎండలు మండిపోతుండగా.. విపరీతమైన ఉక్కపోతతో వృద్దులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు పది మంది దాక వృద్దులు, మహిళలు మృతి చెందినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అధికారికంగా మాత్రం ముగ్గరు మృతి చెందారని అంటున్నారు. వేగంగా వీస్తున్న వడగాలుల వల్ల మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు వడగాలులు ఉంటున్నాయి. ఇంత ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. .రాత్రివేళల్లో కూడా వేడిమి కారణంగా ఉక్కుపోతతో చిన్నారులు, వృద్ధులు తల్లడిల్లుపోతున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వంతోపాటు వివిధ ప్రజా సంఘాలు, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటుచేశారు. శీతల పానీయాలకు డిమాండ్ బాగా పెరిగింది. అదేవిధంగా సంపన్న వర్గాలకే పరిమితమైన కూలర్లు ఎండ తీవ్రత కారణంగా మధ్యతరగతి వర్గాలు కూడా కూలర్లు, ఎయిర్ కండీషన్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక సామాన్య వర్గాలు చల్ల నీటి కోసం కుండలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కుండల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెద్దపాటి కుండ ప్రస్తుతం రూ.100కు పైబడి ధర పలుకుతోంది. మరో 10 రోజుల తర్వాత ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో బయట తిరగవద్దని సూచిస్తున్నారు. అత్యవసర పని ఉంటే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చూసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత నుండి కాపాడుకొనేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.