యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గెలుపు ఎవరిదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సారి గెలుపు తమదే అని విపక్ష వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. టీడీపీ సైతం మరోసారి ఏపీ ప్రజలు తమకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటితేనే... ఏపీ రాజకీయాల్లో తమకు భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భీమవరం, గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ కళ్యాణ్... గాజువాక నుంచి విజయం సాధిస్తారా లేదా అనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో తెదేపా నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లలో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం ముందుకు సాగినట్టు తెలుస్తోంది. ఇక పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ప్రచారం చేసే విషయంలో ఇబ్బందిపడుతూ వచ్చారు. ఈ విషయంలో ఆయనకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. గురువారం పోలింగ్ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలామంది పవన్ అభిమానులు పోలింగ్ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారని సమాచారం. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. మొత్తానికి గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్నది చూడాలి.