టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలు పూర్తయిన అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అయితే చంద్రబాబు ప్రసంగమంతా ఈవీఎంల ట్యాంపరింగ్ మీదనే సాగింది. ఈవీఎంలలో ఉన్న చిప్స్ ను ప్రోగ్రామర్ మార్చే అవకాశముందని, ఎవరి వైపు విజయం ఉండాలో నిర్ణయించవచ్చని, ప్రోగ్రామర్ ఎలా చెబితే అలా నడుచుకుంటుందని తెలిపారు. జగన్, కేసీఆర్, మోదీలు కుమ్మక్కై ఏపీలో కుట్రలు చేయడానికి ప్రయత్నించారన్నారు.దాదాపు రెండుగంటల పాటు సాగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాత్రం ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై సమాధానాన్ని దాటవేశారు. మీరే చూస్తారు కదా? అని మాత్రం చెప్పారు. తమ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని, జగన్ ను చూసి పోలో మంటూ జనం పోలింగ్ కేంద్రాలకు తరలి రారన్నారు. ఆయనలో ఏం చూసి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తుతారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈవీఎంలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు.చంద్రబాబు మీడియా సమావేశంలో కొంత ఆందోళనగానే కన్పించారు. టీడీపీకి విజయావకాశాలపై స్పష్టంగా చెప్పలేకపోయారు. దీంతో పాటు ఎక్కువగా తనపైన, రాష్ట్రంపైన కుట్రలు జరిగాయన్నారు తప్పించి తమ అభ్యర్థుల విజయావకాశాల మీద మాట్లాడకపోవడంతో టీడీపీ నేతల్లోనూ కొంత భయం పట్టుకుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మహిళలు, పెన్షన్లు తీసుకున్న వృద్ధుల ఓట్లు మాత్రం తమకు అనుకూలంగానే ఉంటాయని చంద్రబాబు వారికి మీడియా సమావేశంలోనే కృతజ్ఞతలు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు మీడియా సమావేశంతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం అలుముకుంది. గెలుపుపై ఖచ్చితమైన కామెంట్స్ చేయకపోవడానికి కారణాలేంటా? అని టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు.