YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కనిపించని జాతీయ పార్టీల ప్రభావం

కనిపించని జాతీయ పార్టీల ప్రభావం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎంతో కాలంగా ఆసక్తి రేపుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టమైన అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా ముగిశాయి. ఈ ఎన్నికలను అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెలుగు ప్రజలకు అసలు మజా ఎదురైంది. ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే క్రమంలో చేసిన విన్యాసాలు రాజకీయాలపై ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ పార్టీలకు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా జత కలిసింది. వీటికితోడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్షలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాలని తహతహలాడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా బీజేపీకి ఏపీలో ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే, విభజన హామీలు అమలు విషయంలో ఏపీని మోసం చేసిందనే కారణంతో అక్కడి ప్రజల దృష్టిలో బీజేపీ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. నిధుల కేటాయింపు విషయంలో కూడా కేంద్రంపై అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ-బీజేపీతో కలిసున్నంత కాలం ఆ పార్టీపై మంచి అభిప్రాయంతో ఉన్న ఏపీ జనాలు.. ఎప్పుడైతే ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బరిలో ఉంచిన భారతీయ జనతా పార్టీకి ఏమీ కలిసి రావడం లేదు.గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆకుల సత్యనారాయణలు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. అలాగే విశాఖ పార్లమెంట్‌కు కంభంపాటి హరిబాబు, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. అయితే, వీరిలో ఇప్పుడు ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. విష్ణు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, మాణిక్యాల రావు మాత్రం నరసాపురం బరిలో ఉన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలను కూడా దక్కించుకునే అవకాశాలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Posts