యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అయోధ్యను పాలించే దశరథుడికి సంతానం లేకపోవడంతో గురువు వశిష్ఠ మహర్షి సూచన మేరకు పుత్రకామేష్ఠి యాగం నిర్వహించారు. యాగానికి ప్రశన్నమైన దేవతలు ఓ పాయసపాత్రను దశరథునికి ప్రసాదించారు. పాత్రలోని పాయసాన్ని మూడు భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులూ గర్బం దాల్చగా ఛైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నలకు వారు జన్మనిచ్చారు. పుత్ర కామేష్టియాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నారు. ఛైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు రాముడి జన్మించగా, ఈ రోజును హిందువులు నవమి పేరుతో పండగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు, శ్రీసీతారామ కళ్యాణం జరుపుతారు. రామాయణంలో ప్రధానమైనవి రామరావణ యుద్ధం, రామరాజ్య పాలన. అనేక మంది రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భాల్లో తాము రామరాజ్యం తెస్తామని హామీలు గుప్పిస్తారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం కోసం కలగన్నారు. అసలు పాలకుల ప్రకటనలకే పరిమితమైన రామరాజ్యం ఎలా ఉండేది? సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? అంటే రాముని లక్షణాలు పుణికిపుచ్చుకున్న నాయకులు ఉన్నారా? అంటే సమాధానం శూన్యమే? మరి రామరాజ్యం తీసుకొస్తామనే పాలకులకు, కోరుకునే ప్రజలు మాత్రం రాముని సుగుణాలు తెలుసుకోవాలి. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగనవాడు..వీరుడు, సాహసికుడు.. వేద వేదాంతాలను తెలిసివాడు. చేసిన మేలును మరవనివాడు. సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞాన వంతుడు. సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.. శకల శాస్త్రాల్లోనూ పండితుడు. సమస్త కార్యాలలోను సమర్ధుడు.. సులక్షణమైన రూపసి (అందగాడు), అత్యంత ధైరశాలి, క్రోధాన్ని జయించివాడు, సమస్తలోకల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేని వాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు.