యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను ఆడించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, తాజాగా ఎన్నికల సంఘం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. శనివారం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు సునీల్ అరోడా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్ నిర్వహించాల్సి రావటంపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ విషయంలో సంఘం వ్యవహరించిన తీరును నిరసిస్తూ 15 పేజీల వినతిపత్రం సమర్పించారు. ‘వీవీప్యాట్‌లలో ఎందుకిన్ని సమస్యలు వచ్చాయి? ఎవరైనా మోసం చేశారా? లేదంటే హ్యాకింగ్‌కు పాల్పడ్డారా? 50% వీవీప్యాట్‌లు లెక్కించడానికి మీకున్న సమస్య ఏంటి?’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచీ అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేస్తూ ప్రతిపక్షానికి సహకరించేలా వ్యవహరించిన ఎన్నికల సంఘం పోలింగ్ రోజున అస్తవ్యస్త నిర్వహణతో ప్రజాస్వామ్యాన్ని బలిపశువును చేసిందని ధ్వజమెత్తారు.