YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

జానకీ వల్లభ వైభవం

జానకీ వల్లభ వైభవం

యువ్ న్యూస్ కల్చరల్  బ్యూరో:

శ్రీరాముడు ధర్మయుతమైన మార్గంలో చేసిన సుదీర్ఘ ప్రయాణమే శ్రీమద్రామాయణం. ‘అయనం’ అంటే ప్రయాణం. మూర్తీభవించిన ధర్మ స్వరూపుడైన రాముడు, తన జీవన ప్రయాణాన్ని లోకోద్ధరణకు వినియోగించాడు. శ్రీరామకథ రసరమ్య జీవన వాహినిలా మన సంస్కృతిలో రాజిల్లుతోంది. వాల్మీకి అనే ఓ మహాపర్వతాగ్రం నుంచి మధుర మనోజ్ఞంగా జాలువారిన రామాయణ సుధాలహరి భారతీయ ఆర్ష సంప్రదాయాన్ని సస్యశ్యామలం చేసింది. మాననీయమైన మానవీయ విలువల్ని పాటించటంద్వారా మనిషి, మనీషి అవుతాడనే సందేశాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ నేపథ్యంగా అందించాడు.
రాముణ్ని సనాతనుడిగా వాల్మీకి అభివర్ణించాడు. నవనవోన్మేషంగా నిత్యమై, సత్యమై వెలిగే, అనంతంగా వర్ధిల్లే ధర్మస్ఫూర్తిగా రాముణ్ని, వాల్మీకి కీర్తించాడు. అఖిల ధర్మాలకు వేదమే మూలాధారం. వేదం ప్రతిపాదించిన సంపూర్ణమైన ధర్మాలకు శ్రీరామ పాత్ర ప్రత్యక్ష దర్శనం. పుత్ర, భర్త, సోదర, మిత్ర, రాజధర్మాల్ని సమగ్రంగా అనుసరించి సమస్త జాతికీ రాఘవుడు మార్గదర్శిగా నిలిచాడు. అమృతుడు, అచ్యుతుడు, అనంతుడు, అపారశక్తి సమన్వితుడు, అంతర్యామిగా భక్తులందరి హృదయాల్లో వెలిగే అమందానందప్రదాయుడే శ్రీరాముడని బృహదారణ్యకోపనిషత్తు చెప్పినమాట. జీవాత్మల్లో పరంజ్యోతిగా ప్రభవించే పరబ్రహ్మ ఆకృతే శ్రీరాముడని కాళికా పురాణం ప్రస్తావించింది.
‘రామ’ అనే పేరులోనే అఖండమైన పెన్నిధులున్నాయని, ఆ రెండక్షరాల్ని తారక మంత్రంగా యజుర్వేదం ప్రస్తావించింది. ‘తారకం’ అంటే ఉద్ధరించేది. రాశీభూతమైన సారాంశం అని అర్థం. రాముడి కంటే ముందే రామనామం పరమ పావనకరంగా, అత్యంత మహిమానిత్వమై వర్ధిల్లింది. వ్యాసుడు రచించిన విష్ణు పురాణంలో ప్రహ్లాదుడి ప్రస్తావన ఉంది. త్రేతాయుగానికి ముందున్న కృతయుగానికి చెందిన ప్రహ్లాదుడు భక్తిపూర్వకంగా శ్రీరామనామాన్ని జపించాడని వ్యాసుడు పేర్కొన్నాడు. ‘రామనామం జపించేవారికి ఏ విధమైన భీతి ఉండదు. రామనామం భవభయహరణం. అన్ని తాపాల నుంచి రామనామం ఉపశమనాన్ని కలిగిస్తుంది. దివ్యఔషధమై స్వస్థతను చేకూరుస్తుంది. అగ్నిని సైతం  శీతలంగా మార్చే అత్యద్భుతశక్తి రామనామానికి ఉంది’- అని తన తండ్రి హిరణ్యకశిపుడికి, ప్రహ్లాదుడు శ్రీరామనామ వైభవాన్ని వెల్లడించాడు. రామావతారానికి ముందే రామనామ ప్రాభవం విస్తృత ప్రచారంలో ఉంది. అష్టాక్షరి, పంచాక్షరి మంత్రాల సంపుటీకరణే రామనామం. ఆ జీవాక్షరాల మేలు కలయికకు నిర్దిష్టమైన రూపాన్ని ఆపాదించడానికి శ్రీహరి, రామావతారాన్ని ధరించాడంటారు.
చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రాన, గ్రహాలన్నీ ఉన్నత స్థితిలో ఉండగా దశరథుడి పెద్ద భార్య కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. పరమాత్ముడి జన్మ తిథినాడే కల్యాణం జరిపించాలని బృహస్పతి సంహిత పేర్కొంది. చైత్రమాసంలో శుక్ల పక్ష నవమినాడు శ్రీ సీతారాములకు శాంతి కల్యాణాన్ని నిర్వహించాలని సూత సంహిత సూచించింది.
‘శ్రీరామో బ్రహ్మ తారకమ్‌’- తారక బ్రహ్మస్వరూపుడిగా, తరతరాల అజ్ఞాన తిమిరాల్ని పారదోలే మేరునగధీరుడైన పరిపూర్ణ వ్యక్తిగా రామరహస్యోపనిషత్తు శ్రీరామమూర్తిమత్వాన్ని తేటతెల్లం చేసింది. ‘భద్రో భద్రయ’ అంటూ వేదం ప్రస్తావించిన భద్ర బీజాక్షరాలకు సాకారమే రామభద్రుడు. శుభం, క్షేమం, మంగళం, శ్రేయస్సు, ఆనందం- ఇలా ఎన్నో సానుకూల అంశాల్ని సుభద్రంగా రాముడు తన భక్తులకు అందిస్తాడని విశ్వసిస్తారు. మన మనో మందిరాల్ని ఆత్మారాముడై అలరించే శ్రీరాముడు, చైత్రశుద్ధ నవమినాడు కల్యాణరాముడై జానకీవల్లభుడై భక్త జనరంజకంగా భాసిల్లుతాడు. శ్రీ సీతారాముల కల్యాణ వైభవం- భక్తులందరికీ ఆనందార్ణవమైన మధుర మనోహర తన్మయభరిత తరుణం.

Related Posts