తమిళనాడులో లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారనుందా? లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ మనుగడను శాసిస్తాయని చెప్పనవసరం లేదు. తమిళనాడులో ప్రస్తుతమున్న అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోనే ఉంది. 111 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నెట్టుకొస్తోంది. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నిన్న మొన్నటి వరకు నాలుగు అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ప్రతిపక్ష డీఎంకే కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికల కమిషన్ మిగిలిన నాలుగు స్థానాలకు మే 19వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికారంలో ఉండేది ఎవరో జూన్ మాసంలో తేలిపోనుంది. 2017లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అప్పట్లో పళనిస్వామికి పన్నీర్ సెల్వం మద్దతివ్వలేదు. అయినా పన్నీర్ సెల్వం విశ్వాస పరీక్షలో నెగ్గారు.ప్రస్తుతం అధికార పార్టీ బలం 111 మంది మాత్రమే. ప్రతిపక్ష డీఎంకేకు 97 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో డీఎంకే గాని అన్నాడీఎంకే వ్యతిరేక పార్టీలు గాని పదిహేను నుంచి ఇరవై స్థానాలను గెలుచుంటే పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటున్నారు. టీటీవీ దినకరన్ సయతం పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాచుక్కూర్చున్నారు. తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాలు ఒట్టపిడారం, తిరుపరకుండ్రం, అరవకుర్చి, సూలూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలకు మే 19 ఎన్నిక జరగనుండటంతో రాజకీయంగా హడావిడి మొదలయింది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పళనిస్వామి సర్కార్ కు ముప్పు ఏర్పడలేదు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ కేంద్రాన్ని చూసి భయపడి పార్టీలోనే కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఆశించిన స్థానాలు దక్కకపోతే ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది పళనిస్వామికి ఎదురుతిరిగే అవకాశముంది. ఇప్పటికే ఒకసారి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చడానికి పెద్దయెత్తున నిధులను పళనిస్వామి పారించాల్సి వచ్చింది. మొత్తం మీద 24 అసెంబ్లీ నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలన్నది నిర్ణయిస్తాయన్నది వాస్తవం. మరి అన్నాడీఎంకే ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందో? లేదో? చూడాలి.