ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేర్కొనే పశ్చిమగోదావరి జిల్లాలో తాజా ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు గత ఎన్నికలతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాల్లో టీడీపీ బీజేపీతో కలుపుకుని క్లీన్ స్విప్ చేసేసింది. జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. స్థానిక సంస్థల్లోనూ టీడీపీకి అనుకూలంగా వార్ వన్ సైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి బ్రేకులు వేయాలని ముందు నుంచి ప్రత్యేకమైన ప్లానింగ్‌తో ఉన్న జగన్ మెజారిటీ నియోజకవర్గంల్లో టీడీపీకి చెక్ పెట్టారు. పోలింగ్ సరళిని బట్టీ చూస్తే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లతో పాటు, ఆది నుంచి టీడీపీకి కంచుకోటలుగా ఉంటూ వస్తున్న సీట్లలో సైతం ఈ సారి వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ విషయాన్ని మెజారిటీ టీడీపీ శ్రేణులు సైతం అంగీకరిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన మద్దతుతో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఎవరికి వారే పోటీ చెయ్యడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ జిల్లాలోని భీమవరం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండడం, పవన్ సోదరుడు నాగబాబు సైతం ఇదే జిల్లాలోని నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చెయ్యడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో పశ్చిమలో టీడీపీ క్లీన్ స్విప్ చెయ్యడానికి జనసేన సపోర్ట్ ఒక అనుకూల అంశం అయితే కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత, వైసీపీ సంస్థాగతంగా జిల్లాలో అప్పటికి బలోపేతం కాకపోవడం కూడా టీడీపీకి కలిసివచ్చింది. ఇక ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండడం, పట్టిసీమ సైతం ఈ జిల్లాలోనే ఉండడంతో సహజంగానే పశ్చిమ స్టేట్‌కే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైసీపీ చెరిసగం సీట్లు పంచుకోవచ్చని తెలుస్తోంది. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవ్వడంతో ఇరు పార్టీలు తమకే అనుకూలమన్న భావనతో ఉన్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు ముందు నుంచి టీడీపీ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఇక జగన్ బీసీ నినాదాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. బీసీలు కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జిల్లాలో బలంగా ఉన్న యాదవ, గౌడ సామాజికవర్గాలు జగన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో పలు సార్లు సర్వేలు చేయించిన జగన్ మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ధీటుగా బలమైన అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.జిల్లాలో ఎస్సీ ఓటర్లు సైతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసినట్టు ఓపెన్‌గానే చెబుతున్నారు. ఏలూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి బలంగా ఆశలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఉండి, ప్రజా సమస్యలపై పోరాడడంతో నియోజకవర్గ ప్రజలు అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఛాన్స్ ఇచ్చి చూడాలని ఎలా అనుకున్నారో… ఇక్కడ వైసీపీ అభ్యర్థులపై సైతం పూర్తి సానుకూలత వ్యక్తపరిచారు. ఏదేమైనా టీడీపీకి తిరుగులేని వజ్రపుకోటగా నిలిచిన పశ్చిమలో ఈ సారి వైసీపీ సగం సీట్లకు ఎర్త్ పెట్టేసిందంటే అది అధికార పార్టీకి మామూలు దెబ్బ కాదు