YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంక ఎంట్రీతో `వార్ `ణాసి పాలిటిక్స్

 ప్రియాంక ఎంట్రీతో `వార్ `ణాసి పాలిటిక్స్
 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెసు పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య పోటీగా కాకుండా బీజేపీ, కాంగ్రెసులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైనట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. ఈ ఉత్కంఠ భరిత సన్నివేశానికి వారణాసి వేదిక కాబోతుందా? అంటే అందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని కాంగ్రెసు వర్గాలు బదులిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపోటముల కంటే బహుముఖ ప్రయోజనాలు దాగి ఉండటమే ఇందుకు కారణం. ఒకవైపు స్మృతి ఇరాని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాల్ విసురుతున్నారు. 2014లో తలపడి పరాజయం పాలైనా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా క్రమేపీ బలం పెంచుకుంటూ వచ్చారు స్మృతి. ఎటుతిరిగి ఎటు వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా రాహుల్ దక్షిణాదిన వాయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. దీనిని బలహీనతగా చూపించి కాంగ్రెసును ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఈ ప్రచారానికి చెక్ పెట్టడంతోపాటు మీ ప్రధానిపైనే పోటీ చేస్తున్నాం కాసుకో అంటూ ప్రతిసవాల్ విసరడమూ లక్ష్యంగా ప్రియాంక బరిలోకి దిగనున్నట్లు కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. యూపీఏ లో ఇప్పటికి మిగిలిన కొన్ని పక్షాలు తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలేవీ కాంగ్రెసుతో కరచాలనం చేసేందుకు సిద్ధంగా లేవు. దీనికి ప్రధాన కారణం హస్తం పార్టీ అధికారంలోకి రాదనే అనుమానమే. ఆ బలహీనతను అధిగమించేందుకూ ప్రియాంక పోటీ ఉపకరిస్తుంది.ప్రియాంకను నిజంగా రంగంలోకి దింపుతున్నారా? అవి కేవలం వదంతులేనా? అన్న అనుమానాలూ ఉన్నాయి. అయితే కాంగ్రెసు అగ్రనాయకత్వంలో సాగుతున్న చర్చలు, ప్రస్తుతం దేశంలోనెలకొన్న రాజకీయ వాతావరణం అవసరమైన ప్రాతిపదికను కల్పిస్తున్నాయి. కాంగ్రెసుకు రాజకీయ అనివార్యత ఏర్పడింది. దేశంలో గడచిన ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లు పార్టీకి కొంత ఊపు తెచ్చాయి. అయితే అధికారానికి ముఖ ద్వారంగా భావించే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ ఊపిరి పోసుకోవడానికి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. సమాజ్ వాదీ, బహుజన సమాజ్, రాష్ట్రీయలోక్ దళ్ కూటమి హస్తం పార్టీని దూరంగా పెట్టేశాయి. కాంగ్రెసు వల్ల తమకు కలిసొచ్చేదేమీ లేదని భావించాయి. దీనికి బదులు చెబుతూ ఉత్తరప్రదేశ్ లో బలమైన సమీకరణ జరపాలంటే ప్రియాంక రంగంలోకి దిగడమే శరణ్యమని డిమాండ్ ఉంది. అందుకే ఆమెకు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం కొంతమేరకు పార్టీకి ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థిగా బరిలోకి దిగితే పార్టీకి జోష్ వస్తుంది. ఒక్కసారిగా సంచలనం స్రుష్టించాలంటే నరేంద్రమోడీ మీద పోటీ చేస్తేనే బాగుంటుందని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే ఢీ కొట్టాలని సూచిస్తున్నారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ పార్టీ మొత్తం ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు సోనియా వారసురాలి పోటీ దోహదం చేస్తుంది. సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వంటి పార్టీలూ సహకరిస్తాయి. పోటాపోటీ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా బీజేపీని రాష్ట్రంలోని మిగిలిన చోట్ల బలహీనపరచవచ్చు.ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసుతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ ప్రాబల్యం పెరగడంతో తమ అస్తిత్వం ప్రమాదంలో పడుతోంది. అయినప్పటికీ కాంగ్రెసుతో చేరువగా ప్రవర్తిస్తే కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోననే భయం కొన్ని పార్టీలను వెన్నాడుతోంది. ప్రధానంగా వివిధ రకాల కేసులను ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీల నాయకులకు మోడీ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోంది. స్వతంత్రంగా ఆయా ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినా మోడీ సహిస్తారు. అదే కాంగ్రెసుతో కలిస్తే మాత్రం వారిని రకరకాల ఇబ్బందులు పెడతారనే భావన వ్యాపించింది. దాంతో సాధ్యమైనంత దూరం మెయింటెయిన్ చేస్తున్నాయి కొన్నిపార్టీలు. మోడీని కాంగ్రెసు దీటుగా ఎదుర్కోగలదన్న నమ్మకం కలిగిస్తే కొన్ని ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీ వెనక చేరతాయి. అందువల్ల దేశవ్యాప్తంగా నైతిక మద్దతు పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసు ఓటు షేర్ కూడా పెరుగుతుంది. ఒకనాడు పాన్ ఇండియా పార్టీగా కాంగ్రెసుపార్టీకి మాత్రమే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని కమలం పార్టీ ఆక్రమించింది. తిరిగి తన వైభవాన్ని పునరుద్ధరించుకోవాలంటే కాంగ్రెసు నుంచి ఒక సంచలనాత్మక నిర్ణయం వెలువడాలి. అది ప్రియాంక పోటీ అన్నది కాంగ్రెసు వర్గాల అంచనా. ఈ కారణాలతోనే రాజకీయ వర్గాలు సైతం ప్రియాంక ఏదో చేస్తారనే ఆశగా ఎదురుచూస్తున్నాయి.వారణాసి చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీతో నరేంద్రమోడీ గెలిచారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆశించిన అభివ్రుద్ధి సాగలేదు. గంగా నది ప్రక్షాళన కొలిక్కి రాలేదు. ఇవన్నీమోడీకి ప్రతికూలపరిస్థితులుగానే కాంగ్రెసు అంచనా వేసింది. ప్రియాంక ను తమ సొంత పుత్రికగా వారణాసి ప్రజానీకం భావిస్తారనే భావన ఉంది. పైపెచ్చు ఇందిర అంటే పాతతరానికి ప్రేమాభిమానాలు మెండు. ఈ సంప్రదాయక నగరంలో వారసత్వానికి ఆదరణ ఉంటుంది. కొత్త తరంతోనూ ప్రియాంక బాగా కనెక్టు అవుతారు. మోడీపై తీవ్ర వ్యతిరేకతతో మిగిలిన పార్టీలు ప్రియాంకను గట్టిగా బలపరుస్తాయి. దీనివల్ల పోటీ ముఖాముఖిగా మారుతుంది. బీజేపీ చెమటోడ్చాల్సి వస్తుంది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుంది. మోడీకి ఎదురీత తప్పడం లేదన్న ప్రచారం కమలం శ్రేణుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. గెలుస్తామనే నమ్మకం కంటే దేశవ్యాప్తంగా వచ్చే పబ్లిసిటీ, మోడీకి చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెసు ఈ తరహా యోచన చేస్తోంది. ఒకవేళ ప్రియాంక బరిలోకి దిగితే ఈ పోటీ పోల్ ఆఫ్ పోల్స్ గా రూపు సంతరించుకుంటుంది.

Related Posts