YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒంటరి పోరుకే సిద్ధమౌతున్న కాంగ్రెస్

 ఒంటరి పోరుకే సిద్ధమౌతున్న కాంగ్రెస్

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడానికే నిర్ణయించుకుంది. తన ప్రధాన ప్రత్యర్థులతో చేతులు కలపకూడదని భావిస్తున్నట్లే ఉంది. వర్తమానం కన్నా పార్టీకి భవిష్యత్ ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. బలం లేని చోట పొత్తులు కుదుర్చుకుని, బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగడమే మేలన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇందుకు ఢిల్లీ రాష్ట్రం ఉదాహరణగా నిలుస్తుంది.ఢిల్లీ లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాకమునుపు వరకూ ఢిల్లీ గద్దె మీద ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఢిల్లీ లో హస్తం పార్టీ పట్టుకోల్పోయిన మాట వాస్తవం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బాగా నిలదొక్కకుందనే చెప్పాలి. ఒకరకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంత స్థాయిలోనే బీజేపీకి ఢిల్లీలో ఓటు బ్యాంకు ఉందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తర్వాత స్థానం కాంగ్రెస్ పార్టీదే.
అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీకి ఎదురుగాలి వీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. దాదాపు నెలన్నర రోజుల నుంచి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు చర్చలు నడిచాయి. కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుకు ముందుకు వచ్చింది. అయితే దీన్ని కాంగ్రెస్ కాదనుకుంది. రెండు స్థానాలను తీసుకుని పొత్తుతో వెళ్లేకంటే అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడమే బెటరనుకుంది. అందుకే ఒంటరి పోరుకు మొగ్గు చూపింది.ఢిల్లీలో మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా ప్రచారం చేయడం లేదు. దీనికి కారణం పొత్తు కుదురుతుందేమోనని. అయితే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎంత ప్రయత్నించినా ఆ పార్టీ సుతారమూ అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ శక్తియాప్ ద్వారా ఢిల్లీలోని దాదాపు 52 వేల మంది కార్యకర్తల అభిప్రాయాలను పొత్తుపై తీసుకుంది. మొత్తం మీద చివరకు పొత్తు వద్దని నిర్ణయించుకుంది. ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఈ పరిణామం బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts