యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పైకి అంతా బాగానే కన్పిస్తుంది. కానీ లోలోపల మాత్రం భయం. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం పరిస్థితి ఇదీ. మాండ్య నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చూస్తే బయటకు మాత్రం జనతాదళ్ ఎస్ బలంగా ఉన్నట్లు కన్పిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మవవడు అయిన నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా మాండ్య నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు అధికార పార్టీ చేతుల్లోనే ఉండటం కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించి మెాజారిటి వచ్చి తీరాల్సిందేనన్న ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి రోజూ మాండ్య నియోజకవర్గ బాధ్యులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వారిలో ధైర్యాన్ని నూరిపోస్తూనే మరోవైపు స్వతంత్ర అభ్యర్థి సుమలతపై మైండ్ గేమ్ ఆడుతున్నారు.మాండ్య నియోజకవర్గంలో వక్కలిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాదాపు 60 శాతం ఉన్న వక్కలిగ సామాజిక వర్గం దేవెగౌడ పార్టీకి మద్దతు తెలుపుతూ వస్తోంది. ఆ ఓటు బ్యాంకుపైనే కుమారస్వామి ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. సిట్టింగ్ స్థానాలు తమవే కావడం, వక్కలిగ సామాజికవర్గం మద్దతుతో ఎలాగైనా గెలిచి తీరుతామన్న ధీమాతో పైకి కుమారస్వామి కన్పిస్తున్నప్పటికీ లోలోపల ఏం జరుగుతుందో నన్న టెన్షన్ ఆయనను వదలడం లేదు. అందుకే అప్పుడప్పుడూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ అసహనం ప్రదర్శిస్తున్నారు.ఇక్కడ కాంగ్రెస్ కిందిస్థాయి క్యాడర్ ఇప్పటికే సుమలతకు మద్దతు పలికింది. బహిరంగంగా మద్దతు పలుకుతున్న దాదాపు 20 మంది వరకూ ద్వితీయ శ్రేణి నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయినా వారు లెక్క చేయడం లేదు. కాంగ్రెస్ క్యాడర్ 90 శాతం సుమలత వైపే మొగ్గు చూపుతుండటంతో ఆందోళన ప్రారంభమయింది. దీనికితోడు నిఖిల్ గౌడను బరిలోకి దించడంతో సొంత పార్టీలోనూ కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని టిక్కెట్లు ఆ కుటుంబానికేనా? అన్న ప్రశ్నలు జేడీఎస్ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద మాండ్యలో బయటకు జేడీఎస్ కు అనుకూలంగా కన్పిస్తున్నా లోలోపల మాత్రం సుమలతకు అనుకూలంగానే అంతా జరిగిపోతున్నట్లు అనుమానం మాత్రం కుమారస్వామిలో కన్పిస్తుంది.