యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
రియల్ జంట అక్కినేని నాగచైతన్య, సమంత రీల్ కపుల్‌గా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. సున్నితమైన భావోద్వేగాలు, భార్యాభర్తల బంధం, ప్రేమకథకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘మజిలీ’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రెండో వారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తూనే ఉంది. ‘మజిలీ’ని సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తోన్న నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌తో ఇంకా నాటౌట్‌గా ‘మజిలీ’ నిలిచిందని షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది. చైతన్య కెరీర్‌లోనే ఇది అత్యధికం. కాగా, ఈ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ విలువ రూ.33.5 కోట్లని అంటున్నారు. ‘మజిలీ’ థియేట్రికల్ రైట్స్‌ను తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.16 కోట్లకు విక్రయించారట. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25 కోట్లకు పైగా షేర్ వసూలైంది. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయింది. 10 రోజుల్లోనే ‘మజిలీ’ అద్భుతమైన లాభాలను మూటగట్టుకుంది.