YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్మృతి ఇరానీ రూపంలో మరో ఇబ్బంది

స్మృతి ఇరానీ రూపంలో మరో ఇబ్బంది
మోడీ ప్రభుత్వానికి స్మృతి ఇరానీ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మోడీ మంత్రివర్గంలో ఓ కీలక శాఖకు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ చదువు విషయంమై తీవ్ర రభస నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు స్మృతి పై ఆధారాలు చూపిస్తూ ఆరోపణల వర్షం కురిపించారు. ఈ కారణంగా ఎన్నికల్లో పోటీకి ఆమెపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది డిమాండ్‌ చేశారు.ఎన్నికల అఫిడవిట్‌లో తన విద్యార్హతలకు సంబంధించిన వివరాల ద్వారా బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అడ్డంగా దొరికిపోయింది. ఇది గమనించిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ఆమెపై విరుచుకుపడుతూ మాట్లాడారు. స్మృతి.. తన విద్యార్హతలపై తప్పుడు పత్రాలను సృష్టించారని, ఈ విషయంలో ఆమె ఎన్నోసార్లు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూవచ్చారని ఆమె పేర్కొన్నారు. 2014లో ఓ కార్యక్రమం సందర్భంగా తాను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసినట్లు స్మృతి చెప్పారని, అలాంటిది ఆమే.. తాజాగా అమేఠీ ఎన్నికల అఫిడవిట్‌లో ఇంటర్‌ మాత్రమే చదివినట్లు వివరాలను పొందుపర్చారన్నారు. ఆమె డిగ్రీ పూర్తిచేయలేదని తాము ఇన్నాళ్లు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన స్మృతి.. తాజా అఫిడవిట్‌ ద్వారా తాను డిగ్రీ పూర్తిచేయలేదన్న విషయాన్ని స్వయంగా ఆమెనే అంగీకరించినట్లయిందని అన్నారు.2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తిచేసినట్లు స్మృతి పేర్కొన్నారు. 2011లో రాజ్యసభ ఎన్నికకు సమర్పించిన అఫిడవిట్‌లో 1994 ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ ద్వారా బీకాం కోర్సులో ప్రవేశం పొందినట్లు, దాన్ని పూర్తిచేయలేకపోయినట్లు వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఓపెన్‌ లెర్నింగ్‌ ద్వారా బీకాంలో ప్రవేశం పొందినట్లు, దాన్ని పూర్తిచేయలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇక తాజాగా అమేఠీలో సమర్పించిన అఫిడవిట్‌లో 1991లో సెకండరీ స్కూల్‌, 1993లో సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పూర్తిచేసినట్లు వెల్లడించారు. 1994లో ఓపెన్‌స్కూల్‌ విధానంలో బీకాంలో ప్రవేశిం పొందానని, దాన్ని పూర్తిచేయలేకపోయానని వెల్లడించారు. గతంలో కూడా తన విద్యార్హతలకు సంబంధించి తప్పుడు వివరాలు పేర్కొంటున్నారంటూ స్మృతీ ఇరానీపై చాన్నాళ్లుగా ఆరోపణలున్నాయి.ఇదే విషయాన్ని అదను చూసి కాంగ్రెస్ మరోసారి వెలికితీసింది. స్మృతి టీవీ నటిగా వచ్చిన ‘క్యూంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’ సీరియల్‌ను గుర్తుచేస్తూ ‘‘ఇప్పుడు స్మృతి సరికొత్త సీరియల్‌ వస్తోంది. అది.. క్యూంకీ మంత్రి భీ కభీ గ్యాడ్యుయేట్‌ థీ అని’’ వ్యంగ్యంగా మాట్లాడుతూ కాంగ్రెస్ విరుచుకుపడింది. తన చదువు విషయంలో తప్పుడు అఫిడవిట్ల ద్వారా ప్రజలను స్మృతి తప్పుదోవ పట్టించారని, ఇందుకు మంత్రిగా ఆమె రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో మోడీ ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.

Related Posts