పదో తరగతి ఫలితాలు ఇంకా రాలేదు..... ఇంటర్ రిజల్ట్ వచ్చి 24 గంటలన్నా కాలేదు.. కానీ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలో ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది.. కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఆడ్మిషన్ల ప్రక్రియ చాలా కీలకం. ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయో.. లేదో.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల సిబ్బంది గణం.. గ్రామాల్లోకి పరుగులు పెడుతున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలైతే ఏకంగా ఇంటర్ ఫలితాల వెల్లడికి నెలరోజులు ముందుగానే గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంటర్ కాలేజీలు పీఆర్‌ఓ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని అడ్మిషన్ల తంతును చేపట్టాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఇంటర్ ప్రవేశాలు చేపడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు లెక్కచేయడంలేదు. అటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశాల జోరు హోరేత్తిలా కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చాలా కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను ముగింపు దశకు తీసుకురాగా.. కొన్ని కాలేజీలు అడ్మిషన్ల వేటలో వెనకబడ్డామంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. తమ కాలేజీల్లో 100 శాతం సీట్లు నింపుకోవడానికి నానా గడ్డి కరుస్తున్నారనే చెప్పాలి. మరికొన్ని కాలేజీల యాజమాన్యాలు పదుల సంఖ్యలో బ్రాంచ్‌లను ప్రారంభిస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఇంటర్ కాలేజీలో ఒక్క అడ్మిషన్ చేయిస్తే.. రూ.వేలల్లో ముట్టజెప్పుతున్న ఘటనలు గ్రామాల్లో నిత్యం దర్శనమిస్తున్నాయి. కాలేజీల యాజమాన్యాలు పీఆర్‌ఓలను క్షేత్రస్థాయిలోకి పంపి.. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లను, గ్రామీణ ప్రాంత వైద్యులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఆడ్మిషన్లను చేయించుకుంటున్నారు. ఫలితంగా వారికి ఒక్కో అడ్మిషన్‌కు రూ.10 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. టీచర్లను తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు నమ్ముతుండడంతో వారు రిఫర్ చేసిన కాలేజీల్లోనే ఆడ్మిషన్ పొందేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీల ద్వారా కాలేజీల యాజమాన్యాలు సీట్లు నింపుకుంటున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భారీగా ఇంటర్ అడ్మిషన్లు జరిగాయి. నల్లగొండ, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సూర్యాపేట, భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్, కోదాడ, కల్వకుర్తి, మహబూబ్‌నగర్, నిర్మల్, సిరిసిల్ల వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు భారీగా అడ్మిషన్లను చేయించుకున్నాయి. పదో తరగతి పరీక్షల ప్రక్రియ ముగిసిన నాటి నుంచే ఈ ప్రాంతాల్లో తమ సిబ్బందిని కాలేజీల యాజమాన్యాలు రంగంలోకి దించాయి. ఇంటర్ ఫలితాలు వస్తే.. అడ్మిషన్లు దొరకవని.. దొరికినా.. ప్రస్తుతం ఉన్న ఫీజులకు రెండింతలు అవుతుందని పీఆర్‌ఓలు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగానే ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో హోటల్స్, లాడ్జిలను ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు తమ సిబ్బందికోసం అద్దెకు తీసుకుని రోజుల తరబడి అక్కడే ఉంచుతున్నారు.. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వచ్చే విద్యా సంవత్సరంలో కొనసాగాలంటే.. తప్పనిసరిగా 20 మంది విద్యార్థులను ఆడ్మిషన్ చేయించాలని పరోక్షంగా కాలేజీల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. సరైన అర్హతలు లేకున్నా.. అడ్మిషన్లు చేయిస్తే.. కాలేజీలో ఉద్యోగానికి గ్యారెంటీ ఉంటుంది. టార్గెట్ కంటే ఎక్కువ అడ్మిషన్లు చేయించినవారికి ప్రత్యేక అలవెన్సులతో పాటు వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ స్థాయి పోస్టులను అప్పజెప్పుతున్నారు. ఇంటర్‌లో బోధించేందుకు ఉండాల్సిన ప్రతిభ కంటే.. అడ్మిషన్లను చేయించే ప్రతిభ ఉండాలని ఆయా కాలేజీల యాజమాన్యాలు బాహాటంగా తేల్చి చెబుతున్నాయి.