యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒక్కో పార్టీకి ఒక్కో చోట స్థాన బలం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థి ఎవరైనా.., ప్రత్యర్ధులు ఎవరైనా అక్కడ ఆ పార్టీదే పైచేయి అవుతుంది. అటువంటి నియోజకవర్గాలనే పార్టీ కంచుకోటలుగా అభివర్ణిస్తారు. తీవ్రంగా పెరిగిపోయిన వ్యతిరేకత వల్లో లేక మరే ఇతర కారణాల వల్లో ఎప్పుడో ఒకసారి అటువంటి కంచుకోటలు బద్దలు అవుతాయి. ఇక ఆచంట విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుండి 2009 వరకూ టీడీపీ పార్టీది, పొత్తులో భాగంగా ఆ పార్టీ మద్దతు ఇచ్చిన పార్టీలదే విజయం. 2009లో కాంగ్రెస్ తరపున పితాని సత్యనారాయణ పోటీ చేసి తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన పరిణామాల నేపధ్యంలో పితాని తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇప్పుడు కూడా టీడీపీ తరపున ఆయనే ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఇప్పుడు ఆచంట గడ్డపై జెండా ఎగురవేసే వీరుడెవ్వరు అంటే చెప్పడం కష్టంగానే ఉంది. ఒకప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు.. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉండగా జనసేన టీడీపీకి మద్ధతు ఇచ్చింది. టీడీపీ గెలుపులో జనసేన కూడా ఒక భాగమైందనేది అక్షర సత్యం. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుండటంతో ఆచంటలో త్రిముఖ పోరు జరుగుతోంది. టీడీపీ నుండి పితాని, వైసీపీ నుండి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, జనసేన నుండి జవ్వాది విజ్జిబాబు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన అభ్యర్ధికి ఎక్కువ మైలేజ్ లేకపోయినా జనసేన రాకతో ఓట్ల చీలిక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన ప్రత్యర్ధులైన టీడీపీ, వైసీపీలలో జనసేన ఎవరి ఓట్లు చీల్చబోతోంది అనేది తెలియక ఇప్పుడు ఆ రెండు పార్టీలు గెలుపు కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు.ఆది నుండి ఆచంటలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు, శెట్టి బలిజలు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్నారు. పితాని బీసీ కావడంతో ఆచంట బీసీలంతా ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే నియోజకవర్గంలో మంత్రి పితాని చేసిన అభివృద్ది పనులు ఆయనకు ప్లస్ కాగా…, కాంగ్రెస్ నుండి టీడీపీలోకి రావడంతో పార్టీ శ్రేణులని కలుపుకోవడంలో విఫలమయ్యారు. రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత కూడా ఉంది. ఏదేమైనా ఆయన బీసీల ప్రియమైన నేతగా పేరు గడించారు. జనసేన ఓట్లు అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో ఇంచుమించు ఒకే మొత్తంలో ఓట్లు చీల్చ గలిగితే మళ్ళీ విజయం పితాని సొంతమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఇక వైసీపీ అభ్యర్ధి రంగనాథరాజు విషయానికి వస్తే రైస్‌మిల్లర్ల మద్దతు కూడగట్టుకుని ప్రత్యర్ధులపై విజృంభించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తున్నారు. ఆయన క్షత్రియుడు కావడంతో సొంత సామాజికవర్గంలో ఓట్లు తక్కువ ఉన్నాయి. రెడ్ల సపోర్ట్ ఉన్నా వారి ఓట్లు తక్కువే. బీసీల్లో సరైన పట్టు సాధించేందుకు ఆయన చేసిన కృషి తక్కువేనని చెప్పుకోవాలి. కానీ, స్థానికంగా కొన్ని విషయాల్లో ఆయన చేయూతనిచ్చారు. అది కొంచెం కలిసి రావొచ్చు. జనసేన గనుక టీడీపీ ఓట్లు చీల్చగలిగితే రాజు గారినే విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఎన్నికల్లో జనసేన విజయం సాధించకపోయినా తమ ప్రత్యర్ధి పార్టీల గెలుపు-ఓటములలో మాత్రం కీలక పాత్ర పోషించనుందని అర్ధమవుతుంది. ఈ త్రిముఖ పోటీలో గెలుపెవరిని వరిస్తుందో తెలియాలంటే మరో నలభై రోజులు ఆగాల్సందే. ఇక్కడ మాత్రం పందెపు రాయుళ్ళకి మాత్రం పండగే