యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పోలింగ్ తర్వాత సీన్ మారిందా…? ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటి? తెలుగుదేశం గతంలో మాదిరి పట్టు నిలుపుకుంటుందా? వైసీపీకి అడ్వాంటేజీ ఉందా? ఇక్కడ జనసేన ప్రభావం ఎంత? ఇది ఇప్పుడు కృష్ణా జిల్లాలో హాట్ హాట్ టాపిక్. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పార్టీల అంచానాలు భారీగా పెరిగాయి. ఇక్కడ తమకు అధిక స్థానాలు వస్తాయని ప్రతి పార్టీ చెబుతోంది. అయితే పోలింగ్ సరళని పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ గట్టి పోటీ కన్పిస్తుంది. గత ఎన్నికల కంటే ఇక్కడ వైసీపీ పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఐదు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. పదకొండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించింది. అయితే తాజాగాఎన్నికలు జరగడంతో ఇక్కడ ఈసారిసీన్ ఛేంజ్ అయ్యేటట్లు ఓటర్ల నాడిని బట్టి తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. అన్ని స్థానాల్లో నెక్ టు నెక్ పోటీ ఉంటుందన్నది అంచనా. ఎవరికీ భారీ మెజారిటీలు రావన్నది దాదాపుగా తేలిపోయింది. మొత్ం 16 అసెంబ్లీ స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.జగ్గయ్యపేట, నందిగామ, పెనమలూరు, పామర్రు, గుడివాడ, మైలవరం, తిరువూరు, కైకలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఈ నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీకి ఎడ్జ్ కన్పిస్తుండగా మరికొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండేఅవకాశముంది. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, గుడివాడ, తిరువూరు, కైకలూరు నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత అనుకూల వాతావరణం కన్పిస్తుంది. పెనమలూరు, మైలవరం, కైకలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండే అవకాశముంది.ఇక విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, నూజివీడు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఇక్కడ జనసేన అభ్యర్థులు బలంగా ఉండటంతో తాము గెలవకున్నా ఒకరిని ఓడించేంత బలం ఉందని మాత్రం చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారడంతో గెలుపోటములు అంచనావేయడం కష్టంగానే ఉంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఈ నియోజకవర్గాల్లో ఆందోళనగా ఉండటం కన్పించింది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో గత ఎన్నికల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం మాత్రం ఉందనే చెప్పాలి.