యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం టెక్కలి. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటమే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. అచ్చెన్నాయుడిని ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్లే కన్పించింది. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సాక్షాత్తూ వైసీీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడి నియోజకవర్గంపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వైసీపీ నేతలందరినీ ఎన్నికలకు ముందే ఏకతాటిపైకి తెచ్చారు.నిజానికి టెక్కలి నియోజకవర్గం అచ్చెన్నాయుడికి అండగా నిలబడే నియోజకవర్గం. గత ఐదేళ్ల నుంచి చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తాయని అచ్చెన్నాయుడు అంచనాలు వేసుకున్నారు. ఎన్నికలకు ముందు వరకూ వాస్తవానికి నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది. ఆయన తనకు ప్రత్యర్థి ఏమాత్రం సరితూగడని కూడా బహిరంగ ప్రకటనలు చేశారు.కాని పోలింగ్ సమాయానికి సీన్ మారిపోయింది. ఇక్కడ పేరాడ తిలక్ ను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. ఈనియోజకవర్గంలో 72 వేల మంది కాళింగ సామాజిక వర్గ ఓటర్లు ఉంటారు. అచ్చెన్నాయుడు సామాజికవర్గానికి చెందిన వెలమ ఓటర్లు ఇక్కడ ఉంది కేవలం 17 వేల మంది మాత్రమే. అయితే గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ మద్దతు అచ్చెన్నకు కలసి వచ్చింది. ఈసారి వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో గంపగుత్తగా ఆయనకే పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాళింగలంతా ఏకతాటిపైన నిలబడి పేరాడకు మద్దతుగా నిలిచారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాళింగ సామాజికవర్గంలో పట్టున్న నేతలందరూ ఏకతాటిపైకి తేవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లు గతంలో గ్రూపులు మెయిన్ టెయిన్ చేసేవారు. కానీ ఈసారి ఇద్దరూ ఐక్యంగా పనిచేయాలని జగన్ క్లాస్ పీకడంతో ఇద్దరూ ఒకరి గెలుపునకు మరొకరు కృషి చేశారు. దీనికి తోడు కాళింగ సామాజికవర్గంలో బలమైన నేత కిల్లి కృపారాణి కూడా వైసీపీలో చేరడం టెక్కలిలో వైసీపీకి మరింత బలం చేకూరింది. పోలింగ్ తర్వాత వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి సీటును తన ఖాతాలో వేసుకున్నామని చెప్పడం వారి నమ్మకానికి నిదర్శనం. మరి అచ్చెన్న అంచనాలు తప్పుతాయా? అన్నది చూడాల్సి ఉంది.