YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా మీద దాడులు జరిగాయి గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్

 వైకాపా మీద దాడులు జరిగాయి గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను వైకాపా అధినేత వైయస్ జగన్, ఇతర పార్టీ సీనియర్ నేతలు మంగళవారం కలిసారు.  రాష్ట్రంలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై గవర్నర్ కు జగన్ వివరించారు.  పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు దాడులకు పాల్పడ్డారని గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేసారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ లు తెరిచి ఈవీఎంలను బయటకు తీశారన్నారు. ఈవీఎంల భద్రతపై కూడా గవర్నర్ కు వివరించామని జగన్ అన్నారు.   అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారని  జగన్ ఆరోపించారు. ఇనుమెట్ల పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి, లోపల అధికారులు ఉండగానే, తలుపులు బిగించుకున్నారని, ఈ విషయం రికార్డెడ్ గా ఉందని అన్నారు.  తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు. కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని జగన్ వ్యాఖ్యానించారు. గురజాలలో ఓట్లు వేయలేదని ముస్లింలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని జగన్ ఆరోపించారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్ బాబుని కొడితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.  ఎన్నికలకు ముందు తమకు నచ్చిన పోలీసు అధికారులకు, తమ కులం వారికి ప్రమోషన్లు ఇచ్చారని అన్నారు.  దాని ఫలితంగానే ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డీఎస్పీలు టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు.  గవర్నర్ కల్పించుకోవాలని తమ పార్టీ కోరిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని జగన్ తెలిపారు. 

Related Posts