Highlights
- మున్సిపల్ కార్పొరేషన్ లో 95 వార్డులు
- 62 వార్డుల్లో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా
లూథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. 95 వార్డుల్లో 62 వార్డులను కైవసం చేసుకుంది. శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి కేవలం 22 వార్డుల్లో గెలవగా, ఎల్‌పీ-ఏఏపీ కూటమి 8 వార్డులను సొంతం చేసుకుంది. నాలుగు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అతిపెద్ద మున్సిపాలిటీగా చెప్పుకునే లూథియానాలో ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలే చేశాయి.
అమృత్‌సర్, పాటియాలా, జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలలు తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమృత్ సర్, పాటియాలా, జలంధర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం లూథియానా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 108 టేబుల్స్‌తో తొమ్మిది కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం పది గంటలకే కాంగ్రెస్ ఆధిక్యతలోకి రాగా, 11 గంటల సమయానికి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాగించింది. గత శనివారంనాడు లూథియానా సివిక్ పోల్స్ జరిగాయి.