యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఇంటర్మీడియట్ పరీక్ష జరిగి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పరీక్ష ఫలితాలను విడుదల చేసినా తెలంగాణలో మాత్రం ఫలితాల విడుదల ఆలస్యం కావడానికి కారణం ఏమిటో వివరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.. ఈ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక వ్యవహారాల కోసం గతంలో ఉన్న సంస్థను కాదని కొత్తగా గ్లోబరీనా అనే సంస్థకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో, అసలు ఇంటర్మీడియట్ బోర్డులో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మన్ డిమాండ్ చేసారు.ఊరు పేరు అనుభవం లేని సంస్థకు కీలక బాధ్యతలు అప్పజెప్పడం వెనుక కారణమేంటి? భవిష్యత్తుకు వారిధి లాంటి పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం సరైంది కాదు.ష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పరీక్షలు సహా ప్రతీ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా విఫలమైంది. ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ నుంచి ఫలితాల ప్రక్రియ వరకు అన్నింటా బోర్డు పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రతి దశలోనూ లోపాలు, తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యంతోనే సకాలంలో ఫలితాలను ప్రకటించలేని దుస్థితి నెలకొందని, ఈ నెల 18 న ఫలితాలు విడుదల చేస్తామని బోర్డ్ ప్రకటించినా అందులో ఎన్ని తప్పులు వుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని, బోర్డు తప్పిదాల కారణంగా ఫలితాల్లో తప్పులు దొర్లితే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో బోర్డు ఉన్నతాధికారులు ఆన్‌లైన్ ప్రవేశాలు, పరీక్ష ఫీజుల చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేషన్, ఫలితాల ప్రక్రియ వంటి ప్రీ ఎగ్జామినేషన్ పనులను గ్లోబరినా అనే సంస్థకు అప్పగించడం వైఫల్యాలకు కారణంగా తెలుస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆ సంస్థ పాత రికార్డు ఆధారంగా పనులను అప్పగించాల్సి ఉన్నా అవేవి చూడకుండానే అప్పగించినట్లు తెలుస్తోంది. కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని పూర్తిగా రికార్డు చేయలేకపోయింది. దీంతో బోర్డు అధికారులు మళ్లీ సీజీజీని కోరి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయడం వాస్తవం కాదా? అటు ప్రాక్టికల్ పరీక్షల్లో ఎదురైన వైఫల్యాలూ ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల మార్కులను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉన్నా సాఫ్ట్‌వేర్ సమస్యలతో దాదాపు 72 వేల మంది ఒకేషనల్ విద్యార్థుల మార్కులు అప్‌లోడ్ కాలేదన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.హాల్‌టికెట్ల జనరేషన్‌లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఇటు ప్రశ్నపత్రాల పంపిణీలోనూ సమన్వయ లోపంతో సమస్యలు ఎదురయ్యాయి. ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష ప్రశ్నపత్రాలను పంపించారని, ఒకేషనల్ విద్యార్థుల ప్రశ్నపత్రాలు అయితే జిరాక్స్ తీసి పరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంన్నారు. పరీక్షలు అయ్యాక మూల్యాంకన పనుల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారని, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో అధ్యాపకుల సంఖ్య కన్నా జవాబు పత్రాలు చాలా ఎక్కువగా ఉండడంతో, వాటిని వేరే జిల్లాలకు తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అడుగడుగునా ఇంటర్మీడియట్ పరీక్ష విషయంలో అటు బోర్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం లీకైనట్టు, జవాబు పత్రాలు గల్లంతైనట్టు వస్తోన్న వార్తలు విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణం. ఇక పదో తరగతి ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడం పరిపాటిగా మారిందని, ఇటీవల ముగిసన పరీక్షలో ప్రశ్నాపత్రంలో తప్పులతో విద్యార్థులకు గణితం పేపర్-1లో ఐదున్నర, పేపర్-2లో అర మార్కు కలిపి మొత్తం 6 మార్కులు కలపడం రాష్ట్రం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రంలో విద్యారంగం మెరుగుపర్చేందుకు ఇంతవరకు ఎన్ని నిపుణుల కమిటీలు వేశారు..? అవి ఇచ్చిన సిఫార్సులు ఏమిటి.? వాటిలో ఎన్ని అమలు చేశారు, ఎన్ని చేయలేదు.? అమలు చేయకపోవడానికి కారణమేంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి కీలకమైన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాడుకోవడం దారుణం. ఈ తప్పిదాలకు ఫాంహౌజ్ నుండి పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.