Highlights
- రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదకొండో సీజన్‌లో కెప్టెన్లు లేని తమ జట్లను నడిపించడానికి సమర్థులైన నాయకులను ఆయా ఫ్రాంఛైజీలు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్‌ను.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు రవిచంద్రన్ అశ్విన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఇప్పటి వరకు సారథిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కెప్టెన్సీ రేసులో ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్‌లిన్ ఉన్నప్పటికీ ఇటీవల టీ20 ట్రైసిరీస్‌లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కూడా సూచించారు. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఐపీఎల్-11ఆరంభంలోగా అతడు కోలుకుంటాడో లేదోనని కోల్‌కతా ఆందోళన చెందుతోంది. ఇప్పుడు జట్టులోని మిగతా స్టార్ ఆటగాళ్ల నుంచి కెప్టెన్‌ను ఎంపిక చేయాలని యాజమాన్యం భావిస్తోంది. కేకేఆర్‌లో 2014 నుంచి కొనసాగుతున్న వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప కెప్టెన్ రేసులో ముందున్నాడు. 2017 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 388 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 149 మ్యాచ్‌ల్లో 3735 పరుగులు సాధించాడు. వీటిలో 22 అర్ధశతకాలున్నాయి. గతేడాది గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన దినేశ్ కార్తిక్ 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 2903 పరుగులతో 14శతకాలు సాధించాడు. కరీబియన్ ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ కోటాలో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2012 నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో నరైన్‌కు అపార అనుభవం ఉంది. నాయకత్వ పోటీలో ఉతప్పతో పాటు దినేశ్ కార్తిక్, నరైన్, క్రిస్‌లిన్ కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.