YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు సీఎంలు... చెరో దారి

ఇద్దరు సీఎంలు... చెరో దారి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజకీయ నాయకుల భవిష్యత్తు వ్యూహాల్లో అన్నీ అనుమానాస్పద నిర్ణయాలే కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిపోయాయి. తనకు ఆత్మీయంగా ఉండే పార్టీలకు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారానికి చంద్రబాబు వెళుతున్నారు. మూడో ఫ్రంట్ ముచ్చటను ముందస్తుగా వెలిబుచ్చిన కేసీఆర్ కు పెద్దగా పిలుపులు లేవు. ఇక్కడ అనుభవానిదే పెద్దపీట అని చెప్పాలి. 2014లో టీఆర్ఎస్ విజయం సాధించినా పెద్దగా జాతీయస్థాయి గుర్తింపు రాలేదు. 2018 విజయం మాత్రం ఘనమైనదిగానే చెప్పాలి. మిగిలిన పార్టీలకు సక్సెస్ సూత్రం చూపించారు. సంక్షేమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. రైతుబంధు పథకం ద్వారా రుణమాఫీకి ప్రత్యామ్నాయం చూపించారు. వీటి అవసరాన్ని నరేంద్రమోడీకి వివరించారు. మమతబెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్ లకూ చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే దేశంలోని పార్టీలకు కొత్తమార్గం నిర్దేశించారు. అధికారంలో ఉన్నపార్టీలు దానిని శాశ్వతంగా కాపాడుకోవడానికి అనుసరించాల్సిన సూత్రాలను నిర్వచించారు. ఇంత చేసినా కేసీఆర్ కు తగినంత గుర్తింపు రాలేదు. ఇందుకు ఎవరికి వారిలో చోటు చేసుకున్న అనుమానాలే కారణంగా చెప్పాలి.నేషనల్ పాలిటిక్స్ లో సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ రూపు కట్టడమే తన ఆశయమని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అందుకు తగిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన భావిస్తున్నారు. అయితే బీజేపీతో కలిసిపోతారేమోననే సందేహంతో పూర్తిగా సహకరించేందుకు ప్రాంతీయపార్టీలు దూరం పెడుతున్నాయి. నిజానికి మోడీకి వ్యతిరేక ఫ్రంట్ అంటే చాలు ఉత్సాహంగా ముందుకు వచ్చే మమత, మాయా వంటివారు సైతం పెద్దగా స్పందించకపోవడానికి కారణం టీఆర్ఎస్ అధినేతను ఏదోమూలన శంకించడమే. 2018 శాసనసభ ఎన్నికలలో అంతపెద్ద విజయం సాధించినప్పటికీ తను ఆశించిన దిశలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. తనకు కౌంటర్ పార్టు అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మాత్రం విపక్షాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. కేసీఆర్ ను ఆ అంశమే చికాకు పరుస్తోంది. చంద్రబాబు నాయుడికి గతంలో ఉన్న ట్రాక్ రికార్డు కేసీఆర్ కు ఆటంకంగా మారుతోంది. బీజేపీతో అనేక సందర్భాల్లో బాబు కలిసి పనిచేశారు. రాష్ట్రంలో రాజకీయ అనివార్యతతో ఇప్పుడు కమలంపై కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మిగిలిన ప్రాంతీయపార్టీలకు సైతం బీజేపీ కంటే మోడీనే ప్రథమ శత్రువుగా కనిపిస్తున్నారు. దాంతో తమ గూటికి చెందిన వ్యక్తిగా బాబును భావిస్తున్నారు. కేసీఆర్ అంతటి తీవ్రస్థాయిలో మోడీతో విభేదాలు కనబరచకపోవడంతో ఇతర పార్టీల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు.తెలంగాణ రాష్ట్రసమితితో కలిసి నడిచేందుకు బీజేపీ తొలిదశలో ఉత్సాహం చూపించింది. కానీ ఏపీలో టీడీపీ అనుభవంతో పార్టీ ఎదుగుదలకు అది నష్టదాయకమని కమలనాథులు గ్రహించారు. సొంతంగా బలపడేందుకు దక్షిణాదిలో అవకాశం ఉన్న రెండు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. అందువల్ల కొంత ఆలస్యమైనప్పటికీ తెలంగాణలో సొంతంగానే బలాన్ని పెంచుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్ మైనారిటీలను సంతృప్తిపరచడం ద్వారా అధికారాన్ని కాపాడుకోవాలనే ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రతి వ్యూహంగా మెజార్టీ పోలరైజేషన్ చేయగలిగితే బీజేపీ సాధ్యమైనంత తక్కువ కాలంలోనే రాష్ట్రంలో పట్టుసాధించగలుగుతుందని బీజేపీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ క్రమేపీ బలహీనపడుతోంది. ప్రజలను సమీకరించగల అంశాలను సైతం కోల్పోతోంది. ముస్లిం,మైనారిటీ వర్గాలకు దూరంగా జరగడం కాంగ్రెసుకు సాధ్యం కాదు. మతపరమైన విభజన చేయడం కూడా ఆపార్టీకి ఇబ్బందికరమే. బీజేపీకి అదే అంశం లాభిస్తోంది. టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న పెద్ద నాయకులు కాంగ్రెసు వైపు తొంగి చూడకుండా బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇది ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఈ స్థితిలో టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్నట్లు కనిపిస్తే పార్టీ ప్రయోజనాలకు భంగకరం. దాంతో గతంలో అమిత్ షా మాత్రమే విమర్శలు గుప్పించేవారు. తాజా ప్రచారంలో మోడీ సైతం వేడి పెంచారు. రాష్ట్రంపై కమలానికి పుట్టిన ఆశలు టీఆర్ఎస్ , బీజేపీ ల మధ్య దూరం పెంచాయి.ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎటు ప్రస్థానిస్తాయన్న అంశం ఫలితం తర్వాతే తేలుతుంది. టీడీపీ గెలిస్తే కాంగ్రెసు సహిత ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్రంలో స్థానం పెరుగుతుంది. వైసీపీ గెలిస్తే బీజేపీకి కచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే నేరుగా బీజేపీతో వైసీపీ కలిసే అవకాశాలు తక్కువే. మైనారిటీ, ఎస్సీ,ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఎంతగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల ముసుగు వేసినా ఆయా వర్గాలు కమలంతో దోస్తీని సహించకపోవచ్చు. అందువల్ల బయట్నుంచి మద్దతుకు మాత్రమే వైసీపీ పరిమితం కావచ్చు. దానికి ప్రతిగా పార్టీ పరమైన , వ్యక్తిగత ప్రయోజనాల కోసం చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ కు ఈ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. బీజేపీ తెలంగాణలో ఎదగాలని ప్రయత్నిస్తోంది. మూడో ఫ్రంట్ లోనూ టీఆర్ ఎస్ కు ముఖ్య పాత్ర ఇవ్వడం లేదు. కాంగ్రెసుతో కలవలేదు. దాంతోకేంద్రంలో కీలకం కావాలనుకుంటున్న తన యోచనను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. తెలుగు రాష్ట్రాల పార్టీలు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరించాల్సిందే. అన్ని అవకాశాలు ఎదురుగానే ఉన్నాయి. అయినా ప్రతి అవకాశానికి ఆటంకాలున్నాయి.

Related Posts